Mahaa Daily Exclusive

  నల్గొండలో ప్రణయ్‌ హత్య కేసు ఆరేళ్ల తర్వాత కోర్టు సంచలన తీర్పు..!

Share

ప్రణయ్‌ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ 2 అయిన సుభాష్‌ శర్మకు న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు ఖరారు చేసింది. తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు అనే వ్యక్తి 2018 సెప్టెంబర్‌ 14న సుపారీ గ్యాంగ్‌తో యువకుడు ప్రణయ్‌ను హత్య చేయించాడు. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు విచారణ పూర్తి చేసి, 8 మందిని నిందితులుగా పేర్కొంటూ న్యాయస్థానంలో 2019లో ఛార్జిషీట్​ దాఖలు చేశారు. 6 ఏళ్లకు పైగా కోర్టులో విచారణ సాగగా, ఇటీవలే వాదనలు ముగిశాయి. తాజాగా సోమవారం ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.

ప్రణయ్‌ హత్య కేసులో ఏ 1 గా ఉన్న నిందితుడు మారుతీరావు 2020లో హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసులో ఏ 2 సుభాష్‌ కుమార్‌ శర్మ, ఏ 3 అస్గర్‌ అలీ, ఏ 4 బారీ, ఏ 5 కరీం, ఏ 6 శ్రవణ్‌కుమార్, ఏ 7 శివ, ఏ 8 నిజాంలు మిగిలిన నిందితులుగా ఉన్నారు. వీరిలో సుభాష్‌ శర్మకు బెయిల్‌ రాకపోవడంతో జైళ్లోనే ఉండగా, అస్గర్‌ అలీ వేరే కేసులో జైలులో ఉన్నాడు. మిగిలిన వారందరూ బెయిల్‌ మీద బయటకు వచ్చారు. అనారోగ్య సమస్యలు ఉన్నాయని, తమపై ఆధారపడిన తల్లిదండ్రులు, పిల్లల కోసం శిక్ష తగ్గించాలని నిందితులు న్యాయస్థానాన్ని వేడుకున్నారు. తనకు ఈ కేసుతో సంబంధం లేదని అమృత బాబాయ్ శ్రవణ్‌ కుమార్‌ అన్నారు. ముగ్గురు పెళ్లికాని పిల్లలు ఉన్నందున దయచూపాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు నేపథ్యంలో ప్రణయ్ తండ్రి పెరుమాల బాలస్వామి స్పందించారు. తన కుమారుని పరువు హత్యపై నల్గొండలో ఈరోజు న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో నేరస్తులకు కనువిప్పు కలగాలన్నారు. న్యాయం కోసం జస్టిస్ ఫర్ ప్రణయ్ అంటూ పోరాటం చేశామని అన్నారు. ఈ హత్య తర్వాత చాలా పరువు హత్యలు జరిగాయని వారందరికీ ఈ తీర్పు గుణపాఠం కలగాలని బాలస్వామి అన్నారు. ‘మేము ప్రణయ్ హత్య ద్వారా చాలా కోల్పోయాం. అమృతకు భర్త లేడు. నాకు కొడుకు లేడు. నా మనువడికి నాన్న లేడు’ అని ప్రణయ్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. సుభాష్ శర్మకు ఉరిశిక్ష మిగతా ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్ష పడిందని ఈ క్రమంలో వారి కుటుంబాలు కూడా బాధపడుతుంటాయని, తనకు ఎవరిపై కోపం లేదన్నారు. వారు కూడా ఈ రకమైన హత్యలకు పాల్పడడం విచారకరమని ప్రణయ్​ తండ్రి అన్నారు. ఇలాంటి విషయాల్లో ఏదైనా ఉంటే చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. ఈ తీర్పుతో పరువు హత్యలు ఆగిపోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

జరిగింది ఇదీ

మారుతీరావు కుమార్తె అమృతను ప్రణయ్‌ అనే యువకుడు 2018 జనవరిలో హైదరాబాద్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహంతో రెండు కుటుంబాల మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో ఇరు కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలోనే తాను ప్రణయ్‌తోనే ఉంటానని పోలీసుల సమక్షంలో అమృత తేల్చిచెప్పింది. 2018 సెప్టెంబరు 14న వైద్య పరీక్షల కోసం భర్త ప్రణయ్​, అత్త ప్రేమలతతో కలిసి అమృత ఆస్పత్రికి వెళ్లింది. హాస్పిటల్​ నుంచి తిరిగి వెళ్తుండగా ప్రణయ్​ను దుండగులు కత్తితో నరికారు. దీంతో ఘటనా స్థలంలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. అప్పటికే అమృత గర్భవతి. ప్రణయ్ హత్య అనంతరం అమృత కుమారుడికి జన్మనిచ్చింది. ప్రస్తుతం అమృత, ఆమె కుమారుడు ప్రణయ్ కుటుంబంతోనే ఉంటున్నారు.

ప్రణయ్ ది పరువు హత్య కాదు… కాంట్రాక్టు హత్య

ప్రస్తుత హైడ్రా కమిషనర్, అప్పటి ఎస్పీ రంగనాథ్

ప్రణయ్ హత్య కేసుపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైడ్రా కమీషనర్ రంగనాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన నల్గొండ జిల్లా ఎస్పీగా ఉన్న సమయంలో నాలుగు రోజుల వ్యవధిలోనే నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ప్రణయ్ హత్యకేసులో సంచలన విషయాలు చెప్పి అది పరువుహత్య కాదన్న హైడ్రా కమీషనర్ ప్రణయ్ హత్య కేసులో ఏం చేశారో చెప్పిన రంగనాథ్ పూర్తి టెక్నాలజీ ఆధారంగా ఈ కేసును చేదించినట్టు, దాదాపు 8 నెలల పాటు ప్రణయ్ హత్య కేసు దర్యాప్తు కొనసాగిందన్నారు. కాల్ డేటా మొదలుకొని ప్రతి అంశంలోను జాగ్రత్త వహించినట్టుగా రంగనాథ్ తెలిపారు. తాము కేసు దర్యాప్తులో ఎక్కడ వెనక్కి తగ్గలేదని, దర్యాప్తులో చాలా జాగ్రత్తగా వ్యవహరించి ముందుకు వెళ్లామన్నారు. కోట్ల రూపాయల సుఫారీ తో కూడుకొని ఉన్న వ్యవహారం కావడంతో ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఫైల్ చేసినట్టుగా తెలిపారు. చార్జి షీట్ కు ముందే ముందు ముందు ఏమేమి జరుగుతుంది అన్నదానిపైన గంటలు తరబడి చర్చలు జరిగాయని, భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు వస్తాయనేది దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా ముందుకు వెళ్లామని తెలిపారు. అప్పటి డీజీ మహేందర్ రెడ్డితో పాటు ఇతర అధికారుల సహకారం తమకు ఉందని పేర్కొన్నారు. ఇక ఈ హత్యకేసులో సాక్షులుగా ఉన్నవారు వారేం చెప్పారో అదే విషయానికి చివరి వరకు కట్టుబడి ఉన్నారని రంగనాథ్ వెల్లడించారు. అది పరువు హత్య కాదు, కాంట్రాక్ట్ మర్డర్ అని రంగనాథ్ పేర్కొన్నారు. అమృత, ప్రణయ్ తల్లి ప్రేమలత ఎటువంటి ప్రలోభాలకు కూడా లొంగలేదని చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారని పేర్కొన్నారు. అయితే 2018 సెప్టెంబర్ 14వ తేదీన జరిగిన ఈ హత్య పరువు హత్యగా ప్రచారం జరిగిందని అయితే తాము పోలీసులుగా ఆ విషయాన్ని అంగీకరించలేమన్నారు. అది పరువు హత్య కాదన్నారు. ఒక కులానికి ఎక్కువ పరువు మరో కులానికి తక్కువ పరువు ఉండదని అది కాంట్రాక్టు మర్డర్ అని రంగనాథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్న వారంతా తీవ్ర అభియోగాలు ఎదుర్కొన్న వారని రంగనాధ్ తెలిపారు. అన్ని ఆధారాలతో 1600 పేజీల చార్జ్ షీట్ వేశామని ఎవరెన్ని విమర్శలు చేసిన పట్టించుకోకుండా పోలీసులు ముందుకు వెళ్లి ఈ కేసును చేదించినట్టుగా రంగనాథ్ తెలిపారు.