పెద్ద టోర్నీల్లో భారత్ విజయం సాధిస్తే దేశ వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవడం మాములే. ఇందులో భాగంగానే తాజాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత్ అద్భుత విజయం సాధించింది. దీనితో 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని మళ్లీ భారత జట్టు ముద్దాడింది. ఈ సందర్బాన్ని దేశవ్యాప్తంగా పలు నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభిమానులు జాతీయ జట్టు విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. భారత్ జట్టు విజయం సాధించిన అనంతరం ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో పలుచోట్ల క్రికెట్ అభిమానులు రోడ్ల మీదకు వచ్చి బాణాసంచా కాల్చారు. అయితే, క్రికెట్ ప్రియుల ఆనందోత్సాహాన్ని పోలీసులు అడ్డుకోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అనంతరం హైదరాబాద్ లోని దిల్‌సుఖ్ నగర్, సెక్రటరియేట్, అమీర్ పేట సహా పలు ప్రాంతాల్లో క్రికెట్ అభిమానులు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. అయితే, పోలీసులు అభిమానులను చెదరగొట్టడానికి లాఠీఛార్జ్ చేయడం తీవ్ర విమర్శలకు గురైంది. క్రికెట్ ప్రేమికులు దేశంపై తమకు ఉన్న ప్రేమను, జాతీయ జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంటే పోలీసుల లాఠీఛార్జ్ సరికాదని వారు అసహనం వ్యక్తం చేశారు. కాకపోతే, పోలీసులు మాత్రం వాహనదారులకు ఇబ్బంది కలగకుండా రాత్రి సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అభిమానులను పంపించేందుకు మాత్రమే ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. కొన్ని సోషల్ మీడియాలో విజయోత్సవ సంబరాలను జరుపుకుంటున్న క్రికెట్ అభిమానులపై పోలీసులు లాఠీలు జలిపించినట్లు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ పోస్చులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ పోలీసుల తీరును తప్పుపట్టారు. ఎవరి కోసం పోలీసులు ఇంత అత్యుత్సాహం చూపిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ఎప్పుడు ఎలా స్పందించాలో తెలియనట్లుగా పోలీసులు వ్యవహరించడం బాధాకరమన్నారు.








