తెలుగురాష్ట్రాల్లోని శ్రీ చైతన్య కళాశాలలు, కార్పొరేట్ కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. మాదాపూర్ శ్రీచైతన్య కార్పొరేట్ ఆఫీస్‌లో ఐటీ అధికారులు విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. బృందాలుగా విడిపోయి ఆదాయపన్నుశాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. పన్నుల చెల్లింపులు, ఆదాయ వ్యయాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్, విజయవాడతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఐటీ శాఖ ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ సోదాలను చేపట్టినట్లు తెలుస్తోంది. దాడులలో లభించిన నగదు, తేలిన విషయాలను చూసి అధికారులు నిర్ఘాంతపోయారు. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై సహా పలు ప్రాంతాల్లోని శ్రీ చైతన్య విద్యాసంస్థల కార్పొరేట్ కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తూ ట్యాక్స్ ఎగ్గొడుతున్నట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సోదాలు జరుపుతున్నారు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తూ రిసీట్ ఇవ్వకుండా పెద్దఎత్తున ట్యాక్స్ ఎగ్గొడుతున్నట్లు సోదాల్లో అధికారులు గుర్తించారు. ముందుగా హైదరాబాద్ మాదాపూర్‍లోని ప్రధాన కార్యాలయంలో సోదాలు నిర్వహించిన అధికారులు అక్రమ లావాదేవీలు గుర్తించినట్లు సమాచారం.
అనంతరం వరసగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న శ్రీచైతన్య కార్పొరేట్ కార్యాలయాలపై దాడులు చేశారు. ఈ సోదాల్లోనూ పెద్దమొత్తంలో అక్రమ లావాదేవీలు గుర్తించినట్లు తెలుస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నేరుగా నగదు తీసుకునేందుకు ఒక సాఫ్ట్వేర్.. అలాగే ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కోసం మరో సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసుకున్నట్లు ఐటీ అధికారులు నిర్ధారించారు. నగదు రూపంలో అధికంగా ఫీజులు వసూలు చేసి ప్రభుత్వానికి మాత్రం తక్కువగా చూపించారని ప్రాథమిక విచారణలో గుర్తించారని సమాచారం. అధికంగా ఫీజులు వసూలు చేస్తూ తప్పుడు లెక్కలు చూపించి పన్ను కట్టకుండా ఎగవేతకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే, ఐటీ అధికారులు ఈ వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఒక కార్పొరేట్ కార్యాలయంలో ఏకంగా రెండు కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పక్కనే ఉన్న మరో రెండు బిల్డింగ్ లలో అదికారులు సోదాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా పలు కార్యాలయాలలో కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లను సీజ్ చేసిన అధికారులుృ, విలువైన డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దాడులు కొనసాగుతున్నాయి.








