Mahaa Daily Exclusive

  ఉత్తర తెలంగాణ కుతకుత ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాలలో వడగాల్పులు గరిష్టంగా 42 డిగ్రీల ఉష్ఱోగ్రతలు…!

Share

రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని ఐఎండీ అధికారి ధర్మరాజు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని ఆయన వివరించారు.

వడగాల్పుల ప్రభావం
ఆదిలాబాద్‌, కుమురంభీం, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రతతో పాటు వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఈ జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో హెచ్చరికలను జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నందున మరో 7 జిల్లాల్లోనూ శనివారం నుంచి ఎల్లో హెచ్చరికలు అమల్లోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.