హోలీ వేడుకల్లో గంజాయితో తయారు చేసిన కుల్ఫీ, ఐస్‌క్రీమ్‌తో పాటు గంజాయి బాల్స్ విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహానగరంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు విభిన్న రీతుల్లో హోలీ సంబరాలు చేసుకుంటారు. లోయర్ ధూల్‌పేట్‌లోని మల్చిపురాలో కుల్ఫీ, ఐస్‌క్రీమ్, బర్ఫీ స్వీటులో, సిల్వర్ కోటెడ్ బాల్స్‌లో గంజాయి వినియోగిస్తూ సంబరాలు చేశారు. పక్కా సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎస్టీఎఫ్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి నిందితులను అరెస్ట్ చేశారు. 100 కుల్ఫీలు, 72 బర్ఫీ స్వీట్లు, సిల్వర్ కోటెడ్ బాల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుల్ఫీ, ఐస్‌క్రీమ్ విక్రయించే సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తి గంజాయితో వీటిని తయారీ చేసినట్టు గుర్తించారు. వెంటనే నిందితుడిపై కేసు నమోదు చేశారు. గంజాయి బర్ఫీ, చాక్లెట్లను స్వాధీనం చేసుకున్న సిబ్బందిని ఎక్సైజ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.వి. కమలాసన్ రెడ్డి అభినందించారు. నిత్యం కుల్ఫీ ఐస్‌క్రీమ్ అమ్మే సత్యనారాయణ సింగ్ గంజాయితో తయారు చేసిన కుల్ఫీ ఐస్‌క్రీమ్, స్వీట్ల అమ్మకాలు జరుపుతున్నట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు.








