తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారుల తీరుపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సీరియస్ అయ్యారు. తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఇచ్చిన లేఖలను పరిగణలోకి తీసుకోక పోవటంపై మండిపడ్డారు. తెలంగాణ నేతల లేఖలకూ ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సూచించినా, టీటీడీ పాలక మండలి నిర్ణయించినా ఎందుకు పరిగణ లోకి తీసుకోవటం లేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై టీటీడీ బోర్డు ఖచ్చితమైన దృష్టి పెట్టలన్నారు. పరిస్థితిలో మార్పు రాకుంటే తమ కార్యాచరణ ఏంటో కూడా తేల్చి చెప్పారు.
తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలను పట్టించుకోవటం లేదని ఆ రాష్ట్ర నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ వినతి మేరకు ఆ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల లేఖ లను పరిగణలోకి తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి టీటీడీకి సూచించారు. ఈ మేరకు నిబంధనలు సైతం ఖరారు చేసారు. ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలు అమలు అయ్యేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో, తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు తిరుమలలో దర్శనం వసతి కోసం ప్రజా ప్రతినిధులు లేఖలు ఇస్తున్నారు. తాము ఇచ్చిన లేఖలను టీటీడీ ఉద్యోగులు బేఖాతర్ చేస్తుండటంతో తెలంగాణ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి సురేఖ తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ కూడా రాసారు. ఏపీ ముఖ్యమంత్రి ఆదేశించిన విధంగా అమలు చేస్తే తెలంగాణ ప్రజాప్రతినిధులకు రోజుకు 1100 టికెట్లు అదనంగా పెరుగుతాయని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రోజుకు 7500 దర్శనాలు వీఐపీలకు ఇస్తున్నారు. ఇక ప్రజాప్రతినిధుల లేఖలకు 2 వేల వీఐపీబ్రేక్ దర్శనాలు ఇస్తున్నారు. ప్రస్తుతం రోజూ 75 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. కాబట్టి సహజంగా టీటీడీపై ఒత్తిడి అధికంగా ఉంటుందనే వాదన వినిపిస్తున్నారు. అయితే, తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు పిబ్రవరి 1వ తేదీ నుంచి పరిగణలోకి తీసుకొనేలా తొలుత నిర్ణయం జరిగినా అమలు మాత్రం జరగటం లేదంటూ తెలంగాణ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇదే అంశం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ప్రజాపతినిధుల లెటర్లకు వెంటనే దర్శనాలు, రూమ్ లు ఇవ్వాలని డిమాండ్ చేసారు. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారస్సు లేఖల పట్ల వివక్ష బాధాకరమన్నారు. ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని గుర్తు చేసారు. ఉమ్మడి ఏపీలో 294 మంది ఎమ్మెల్యేలకు బ్రేక్ దర్శనాలు, అకామిడేషన్ ఇచ్చేవాళ్ళని చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల లేఖలు మాత్రమే అనుమతించడం బాధా కరమని పేర్కొన్నారు. లెటర్లు ఇవ్వమని వారే చెప్పారు, అకామిడేషన్ ఇవ్వలేమని కూడా వాళ్ళే చెబుతున్నారుని వ్యాఖ్యానించారు. వివక్ష పట్ల టిటిడి బోర్డు వెంటనే ఆలోచన చేయాలని కోరారు. పార్టీలకు అతీతంగా డిమాండ్ చేస్తున్నామన్నారు. లెటర్లు పంపిస్తామని చెప్పిన ఎంపీ రఘనందన్ అనుమతించకపోతే అందరు ఎమ్మెల్యేలు వస్తామని అల్టిమేటం ఇచ్చారు. ఇక, ఇప్పుడు టీటీడీ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది.








