Mahaa Daily Exclusive

  బ్యాంక్ ఉద్యోగుల సమ్మె సైరన్ రెండు రోజులు బ్యాంకులు బంద్…!

Share

డిమాండ్ల సాధనలో భాగంగా బ్యాంకు ఉద్యోగులు మార్చి 24, 25 తేదీల్లో సమ్మెకు దిగనున్నారు. ఈ రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు బ్యాంక్‌ యూనియన్ల ఐక్య వేదిక యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌-యూఎఫ్​బీయూ తెలిపింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్​- ఐబీఏతో జరిగిన చర్చలు ఎటువంటి సానుకూల ఫలితాన్ని ఇవ్వకపోవడం వల్ల యూఎఫ్​బీయూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఐబీఏతో జరిగిన సమావేశంలో అన్ని యూఎఫ్​బీయూ సభ్య సంఘాలు – అన్ని కేడర్లలో నియామకాలు, ఐదు రోజుల పనివారం వంటి సమస్యలను లేవనెత్తాయి. అయినప్పటికీ కీలక సమస్యలు పరిష్కారం కాలేదని నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్-ఎన్ సీబీఈ ప్రధాన కార్యదర్శి ఎన్​ చంద్రశేఖర్ తెలిపారు.

తొమ్మిది బ్యాంకు ఉద్యోగుల సంఘాలతో కూడిన యూఎఫ్​బీయూ- ప్రభుత్వ రంగ బ్యాంకులలో వర్క్‌మెన్, ఆఫీసర్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయడం వంటి డిమాండ్ల కోసం ఒత్తిడి తీసుకురావడానికి ఇంతకుముందు సమ్మెను ప్రకటించింది. పని తీరు సమీక్షలు, పని తీరు-సంబంధిత ప్రోత్సాహకాలకు సంబంధించి ఆర్థిక సేవల విభాగం- డీఎఫ్​ఎస్​ ఇటీవల జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కూడా యూనియన్లు కోరాయి. డీఎఫ్​ఎస్​ ఆదేశాలు ఉద్యోగ భద్రతకు ముప్పు కలిస్తాయని ఆందోళన వ్యక్తం చేశాయి. ఆంతేకాకుండా​ ప్రభుత్వ బ్యాంకుల్లో డీఎఫ్​ఎస్ “మైక్రో మేనేజ్​మెంట్” అనేది సబబు కాదని వాదించాయి. ఇలాంటి జోక్యాలు బ్యాంకు బోర్డుల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తాయని చెప్పాయి. ఇవే కాకుండా సీలింగ్​ను రూ.25 లక్షలకు పెంచేలా గ్రాట్యుటీ చట్టాన్ని సవరించాలని, ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు వంటి డిమాండ్లను కూడా ఉద్యోగ సంఘాలు ఐబీఏ ముందు ఉంచాయి.
యూఎఫ్​బీయూలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబీఈఏ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్ సీబీఈ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ) వంటి ప్రధాన బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ఉన్నాయి.