Mahaa Daily Exclusive

  జనసేనాని జయకేతనం దేశంలో.. పవనం మోదీకి ఇష్టుడు.. జనం గుండె గెలిచిన ధీరుడు…!

Share

పవన్.. తెలుగునాట పొలిటికల్ తుఫాన్. తెలుగునాటే కాదు.. భారతదేశంలోనే మోదీకి అత్యంత ఇష్టులైన టాప్ టెన్ లీడర్లలో పవన్ చేరిపోయాడు. జనసేనాని.. జయకేతనానికి సంకేతంగా ఆవిర్భావసభ అబ్బురంగా జరిగింది. గత దశాబ్దంన్నర పోరాటానికి, ఆరాటానికి, ప్రజలపై ఉన్న ప్రేమకు, సమాజాన్ని మార్చాలన్న తపనకు, రాజకీయ తారగా వెలిగిపోవాలనుకున్న లక్ష్యానికి.. అన్నింటికీ ఒకే ఒక్క దెబ్బతో పవన్ కల్యాణ్ సమాధానం చెప్పారు. ఆ విజయాన్ని ఘనంగా జరుపుకునేందుకు ఆవిర్భావ సభ వేదికైంది. పవన్ గురించి.. గత ఏడాది కాలంగా దేశమంతా చర్చ జరుగుతోంది. ఒక నటుడు.. ఒక స్టార్ ఇన్ని దాడులు, ఢక్కీమొక్కీలు తిని సహనంతో రాజకీయాలు చేయగలడా? ఓర్పుగా ఉంటే కుంభస్థలాన్నైనా కొట్టొచ్చు అనడానికి పవనే రోల్ మోడల్ అని ప్రధాని మోదీ అనేకమందికి ఉదాహరణగా చెబుతున్నారంటే పవన్ జయకేతన స్థాయి స్పష్టమవుతోంది. పవన్ ఓ సునామీ..పవన్ ఓ తుఫాన్. పవనే రానున్న రోజుల్లో ఎన్డీఏ సౌత్ వెపన్. మోదీ 3.0 సాకారంలో పవన్ పాత్ర స్పష్టం. పవన్ ఆంధ్రా గురించి ఆలోచిస్తే.. ఆయన వ్యూహం దేశ రాజకీయచిత్రాన్నే మార్చింది. అదీ పవన్ అంటే. ఇదీ రాజకీయ జయకేతనమంటే.

తిరుగులేని శక్తి

పవన్ రాజకీయాల్లో ఎన్నో డక్కాముక్కీలు తిన్నారు. ఎన్నో అవమానాలు భరించారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 12 సంవత్సరాలు యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో తిరుగులేని గెలుపును సొంతం చేసుకున్నారు. ‘నువ్వురాజకీయాలకు పనికి రావు’ అన్న నోళ్లను మూయించటం కాదు.. అసెంబ్లీ గేటు కూడా తాకకుండా చేశారు. రాష్ట్రంలోనే కాదు.. కేంద్రంలోనూ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగారు.
పవన్ కల్యాణ్ అంటే ఒక్క ఆంధ్రా రాజకీయాలే కాదు.. భారతదేశ రాజకీయాలు కూడా మాట్లాడుకునేలా విశ్వసనీయత, నిబద్దత, నిజాయితీని సముపార్జించారు. ప్రత్యర్ధులకు పవన్ పంజా చూపారు. అధికారంలోకి వచ్చాక ఎంత నిబద్దతతో ఉండాలో కూడా పవన్ చేసి చూపాడు.

ఇది ట్రైలరే

రాజకీయరంగంలో జనసేనకు అద్భుతంగా కలిసొచ్చింది. ఏడాది క్రితం ఎంతలా విజయాలు లభించాయంటే.. ఇక ఇంతకుమించి ఎవరు సాధిస్తారబ్బా అనేరీతిలో వందశాతం స్ట్రైక్ రేట్ తో దుమ్మురేపారు. సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా జనసేన రికార్డు సృష్టిస్తే.. అంతకు ముందు ఎన్నికల్లో దక్కించుకున్న సీట్లలో పదో వంతు కూడా దక్కించుకోలేక వైసీపీ పూర్తిగా చతికిల పడింది . పోటీచేసిన అన్ని శాసనసభ, పార్లమెంట్ స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలుపొంది దేశం దృష్టిని ఆకర్షించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసి నేషనల్ ఇమేజ్ సొంతం చేసుకున్న జనసేనాని ప్రధాని మోడీ ప్రశంసలు అందుకుంటూ పొలిటికల్ స్క్రీన్‌పై అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రత్యర్ధుల ప్రశంసలు పొందే రాజకీయాలు చేస్తూ.. ఇదీ పవన్ అంటే అనిపిస్తున్నారు. మరోవైపు సోదరుడు నాగబాబును కూడా ఎమ్మెల్సీ చేశారు. త్వరలో ఆయన కేబినెట్ లోకి రానున్నారు. ఇక పవన్ ఇప్పటిదాకా సాధించింది ట్రైలరే. ముందుంది అసలు సిన్మా అని ఆయన అభిమానులు, జనసైనికులు రొమ్మువిరిచి చెబుతున్నారు.

కలిసొచ్చిన కాలం

జనసేనాని పవన్ కల్యాణ్ యువరాజ్యాధినేతగా తెలుగురాష్ట్రాల ప్రజల మనసులు చదివారు. రాష్ట్ర విభజన అనంతరం తానే జనసేన స్థాపించి వ్యూహాత్మక రాజకీయాలకు కేరాఫ్ గా మారారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేనకు, ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు బాగా కలిసొచ్చిన సంవత్సరం 2024 కాగా.. అప్పటి నుండి వెనక్కు తిరిగి చూసుకోకుండా రాజకీయం సాగుతోంది. 2014లో పార్టీని పెట్టినప్పటికీ ఆ ఎన్నికల్లో కూటమి విజయానికి ప్రచారం చేసిన పవన్‌కళ్యాణ్ పోటీకి దూరంగా ఉన్నారు. 2019లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన జనసేన కేవలం ఒక సీటును మాత్రమే గెల్చుకుంది. జనసేనాని అయితే పోటీ చేసిన గాజువాక, భీమవరం రెండుచోట్ల ఓడిపోయారు. అదే జనసేన 2024లో పోటీచేసిన 21 శాసనసభ, రెండు పార్లమెంట్ స్థానాల్లో గెలుపొంది వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. 2024 ఎన్నికల తర్వాత జనసేన పార్టీ ఉండదని, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరారంటూ ఎంతోమంది ఎన్నో విమర్శలు చేసినా ఆయన పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అవగాహన పెంచుకున్నారు. ఏవిధమైన వ్యూహాలతో ముందుకెళ్లాలో సరిగ్గా అంచనా వేయగలిగారు. అప్పటి అధికారపక్షం వైసీపీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా వెనక్కి తగ్గలేదు.. ప్రతి విమర్శకు ధీటైన జవాబు ఇస్తూ ముందుకుసాగారు. అందుకే జయకేతనం ఎగురేశారు. ఎపిలో విభజతో కొత్తగా పెరిగే స్థానాలన్నీ జనసేనకే. వచ్చే ఎన్నికల్లో జనసేన కనీసం 75స్థానాల్లో పోటీచేసే దిశగా ప్రణాళికలు సిద్దమవుతున్నాయి. పోటీచేసిన ప్రతీస్థానం గెలవడమే జనసేన వ్యూహంగా సాగుతోంది.

మాటమీద నిలబడే జనసేన

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ముందు వరకు జనసేన ఓ రాజకీయపార్టీ.. ఎన్నికల తర్వాత ఆపార్టీ ఓ శక్తిగా మారింది. పవర్ ఉంటే ఏదైనా చేయ్యెచ్చు.. జనసేన లక్ష్యం చేరుకోవాలంటే పవర్ కావాలంటూ పవన్ కళ్యాణ్ పదేపదే వ్యాఖ్యానించేవారు. సరిగ్గా 2024 ఎన్నికల తర్వాత ఏపీ ప్రభుత్వంలో జనసేన భాగస్వామిగా మారింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను పవన్ కళ్యాణ్ మర్చిపోలేదు. అధికారంలో ఉన్నా.. లేకపోయినా తాను ప్రజాసేవకుడినేనంటూ ముందుకు సాగారు. ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాల్లో ఎక్కడా తొందరపాటు చూపించకుండా.. నిదానంగా ముందుకెళ్తూ.. అందుబాటులో ఉన్న వనరులతో ఏ విధంగా అభివృద్ధి చేయగలమో ప్రణాళికలు రచించుకుంటూ ముందుకెళ్తున్నారు. తనకు ఇష్టమైన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల బాధ్యతలను నిర్వర్తిస్తూ.. రాష్ట్రంలో తనదైన మార్క్‌ పాలనను ప్రజలకు చూపించేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా ఏదైనా రాజకీయపార్టీ మత విశ్వాసాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. తమది సెక్యులర్ పార్టీ అని అన్ని మతాలను సమానంగా చూస్తామని ప్రచారం చేసుకుంటారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ మాత్రం సనాతన ధర్మాన్ని రక్షించుకోవల్సిన అవసరం ఉందని, తమ పార్టీ సనాతన ధర్మ పరిరక్షణకు కృషిచేస్తుందని బహిరంగంగా ప్రకటించడంతో పాటు తిరుపతిలో ఓ సభ ఏర్పాటుచేసి డిక్లరేషన్ ప్రకటించారు. మహారాష్ట్ర ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షించాయి. ఇండియా, ఎన్డీయే కూటమి మధ్య హోరాహోరీ పోరు నడిచింది. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి ఎక్కువ లోక్‌సభ స్థానాలు గెలుచుకోవడంతో శాసనసభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. రెండు కూటములు అధికారంపై ధీమా వ్యక్తం చేశాయి. చివరకు ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించింది. ముఖ్యంగా గతంలో తెలుగు ఓటర్లు ఎక్కువుగా ఉండే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లేదా ఆ పార్టీ మద్దతు దారులు ఎక్కువుగా గెలుపొందేవారు. ఈసారి పవన్ కళ్యాణ్ తెలుగు ఓటర్లు ఎక్కువ ప్రభావం చూపించే నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో మహాయుతి కూటమి మంచి ప్రదర్శన కనబర్చింది. దీంతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ తెలుగు రాష్ట్రాలు దాటి జాతీయస్థాయికి వెళ్లింది. అప్పటినుంచి పవన్ కళ్యాణ్ నేషనల్ లీడర్ అంటూ జనసైనికులు నినాదాలు హోరెత్తిస్తున్నారు. మరోవైపు ఎన్డీయే సమావేశాల్లో పవన్ కళ్యాణ్‌ను ప్రధాని మోడీ ప్రశంసలతో ముంచెత్తడం ఆయన ఇమేజ్‌ను దేశ స్థాయిలో మరింత పెంచింది. ఢిల్లీలోనూ పవన్ దుమ్మురేపారు. తమిళనాడు ఎన్నికల్లోనూ పవన్ ఎన్డీఏ బ్రాండ్ అంబాసిడర్ కాబోతున్నారు. తెలుగురాజకీయాల్లో పుష్కరకాలం తర్వాత పవన్ శకం ప్రారంభమైందని, మరో పుష్కరకాలం పవన్ శకానికి తిరుగులేదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. . జనసేన ద్వారా ముగ్గురికి మంత్రి యోగం దక్కింది. త్వరలో నాగబాబు కూడా మంత్రి కానున్నారు. జనసేన మరెంతోమందికి పదవులు, బాధ్యతలు అప్పగించనుంది. ప్రజల విశ్వాసానికి అనుగుణంగా జనసేన పనిచేస్తే వెనక్కు తిరిగి చూసే అవకాశమే ఉండదు.
– కేఆర్