Mahaa Daily Exclusive

  మన భాష, మన సంస్కృతి తోనే మనం గుర్తింపు తెచ్చుకోవాలి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు…!

Share

సినిమా సమాజ ఉన్నతిలో భాగస్వామి కావాలి తప్ప, సమాజాన్ని ప్రతికూల విధానాల వైపు నడపకూడదని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో “ఐ ఫ్లై స్టేషన్”, “స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో “తెలుగు జాతీయం – చంద్రబోస్” పేరుతో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సినిమా అత్యంత ప్రభావశీలమైన బలమైన మాధ్యమమని, దాన్ని సమాజ అభ్యున్నతి కోసం ఉపయోగించాలని సూచించారు. సినిమా రంగం నుంచి తాను ఆకాంక్షిస్తున్నది ఇలాంటి మార్పునే అన్నారు. సమాజంలో నేటికీ ఆక్కడక్కడ మూఢనమ్మకాలు, సామాజిక – లింగ వివక్షలు, నిరక్షరాస్యత, అవగాహనలేమి వంటి పలు ప్రతికూల అంశాలు చోటు చేసుకుంటున్నాయి. వీటి పట్ల సమాజం, యువతను జాగృతం చేసే విధంగా సినిమాలు రావాలి. ముఖ్యంగా మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని, భారతదేశ నిజమైన చరిత్రను తెలియజేసే సినిమాల మీద దర్శక నిర్మాతలు దృష్టి పెట్టాలి. ప్రస్తుతం తెలుగు సినిమా ప్రతిభను ప్రపంచం గుర్తిస్తోంది. మన భాష సంస్కృతుల గొప్పతనాన్ని తెలియజేయడానికి ఇదే సరైన సమయం. మన భాషను, మన సంస్కృతిని మనమే కాపాడుకోకపోతే… ఇంకెవరు కాపాడుతారన్నారు.

“మనకు ఆస్కార్ తెచ్చిపెట్టిన “నాటు నాటు” పాట సైతం స్వచ్ఛమైన తెలుగు పదాలతో నేసినదే. పొలం గట్టు దుమ్ము, పోలేరమ్మ జాతర, కిర్రు చెప్పలు, కర్రసాము, మర్రి చెట్టు నీడ, ఎర్రజొన్న రొట్టె, మిరప తొక్కు… ఇవన్నీ తెలుగు వారి సొంతం.” ఇలాంటి అచ్చ తెలుగు పదాలతో పాట రాసి మనం మనలాగా గుర్తింపు పొందవచ్చు అని చంద్రబోస్ నిరూపించారన్నారు. చంద్రబోస్ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని, పెద్ద పెద్ద సమాసాలు, వ్యాకరణ కసరత్తులు లేకుండా సాధారణ పదాలతో ఆయన పాటలు ఉంటాయన్నారు. ” తాను జీవితంలో ఎదగడానికి కారణం అయిన తమ గ్రామంలోని గ్రంథాలయాన్ని పునర్నిర్మించి, యువతకు ప్రేరణగా నిలిచిన చంద్రబోస్ ను, వారికి ప్రోత్సాహం అందిస్తున్న వారి శ్రీమతి సుచిత్రా చంద్రబోస్ లను అభినందించాలని ఈ కార్యక్రమానికి వచ్చానన్నారు. ఒక మంచి పనిని నలుగురిలో అభినందిస్తే ఆ దిశగా మరింత మంది స్ఫూర్తిని పొందుతారని నా ప్రగాఢ విశ్వాసం. ‘ఇంటికో స్వచ్ఛాలయం… ఊరికో గ్రంథాలయం’ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాలన్నది నా ఆకాంక్ష. ఆస్కార్ అవార్డుకు స్ఫూర్తిగా చంద్రబోస్… గ్రంథాలయం నిర్మించడం అభినందనీయం. ” అని వెంకయ్య నాయుడు అన్నారు. బలవన్మరణాలకు ప్రయత్నిస్తున్న ఎంతో మంది యువతను ఆ అగాధం నుంచి బయట పడవేయడానికి “స్పందన” ఫౌండేషన్ చొరవ తీసుకోవడం చాలా మంచి విషయం అన్నారు.