వైద్యులు, వైద్య విద్యార్థులు గ్రామీణ ప్రాంత ప్రజలపై ప్రత్యేక దృష్టి సారించాలని మాజీ ఉపరాష్ర్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ప్రముఖ శస్ర్తచికిత్స నిపుణుడు, రొమ్ము క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ పి. రఘురాం రొమ్ము క్యాన్సర్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమాలకు గిన్నిస్ బుక్ ఆఫ్ వ రల్డ్ రికార్డ్స్ గుర్తింపు లభించిన సందర్భంగా శనివారం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పల్లె ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించే కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలన్నారు. యువతరం ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, ఇంటిలో వండిన తాజా ఆహారాన్ని, పౌష్టికాహారాన్ని తీసుకోవాలని చెప్పారు. సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి, రాత్రి తొందరగా నిద్రపోవాలని, రోజూ వ్యాయామం చేయాలని సూచించారు.
డాక్టర్ రఘురాం మహిళల్లో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు, నివారణకు, తొలిదశలోనే కనిపెట్టేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని, 50 వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 24 గంటల్లో ఆన్ లైన్ ద్వారా యూట్యూబ్ లో 6218 మందికి, బ్రహ్మకుమారీస్ సంస్థలో ప్రత్యక్షంగా 5020 మందికి రఘురామ్ రొమ్ముక్యాన్సర్ పై అవగాహన కల్పించడం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి రెండు రికార్డులు సాధించడం అభినందనీయమన్నారు. ఈ గుర్తింపు ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ కు, కిమ్స్ ఆస్పత్రిలోని కిమ్స్ – ఉషా లక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ కు, బ్రహ్మకుమారీస్ సంస్థకు గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ పి.రఘురాం, కిమ్స్ ఆస్పత్రుల ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.భాస్కర్ రావు, కేంద్ర హోం శాఖ పూర్వ కార్యదర్శి పద్మనాభయ్య, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.








