: అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద ప్రసంగించిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో డ్రగ్స్ నివారణ, సోషల్ మీడియా పోస్టులు, ట్రాఫిక్ నియంత్రణపై మాట్లాడారు. డ్రగ్స్ కేసులో దొరికిన వారికి కరెంట్, నీళ్లు కట్ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు.. సోషల్ మీడియా పోస్టులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్కక్తం చేశారు. డ్రగ్స్, గంజాయి లాంటి మాదకద్రవ్యాల నివారణకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో పలు కఠిన నిర్ణయాలు తీసుకున్నామని, పోలీస్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారికి కరెంటు, నీళ్లు కట్ చేస్తామని కీలక ప్రకటన చేశారు. డ్రగ్స్ విషయంలో ఎంత పెద్ద వారున్నా వదిలిపెట్టేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఫాంహౌస్‌లలో డ్రగ్స్ పార్టీలపై దాడులు చేస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో ఎంతటివారున్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. మరోవైపు విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
సోషల్ మీడియాలో తనపై, ప్రభుత్వంపై చేస్తున్న ట్రోల్స్, పోస్టులపై సీఎం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో హద్దు దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో దారుణమైన భాష వాడుతున్నారన్నారంటూ కుటుంబ సభ్యులు, ఆడబిడ్డల మీద ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతున్నారని, అంతేసి మాటలు అంటుంటే మీరు మనుషులా అంటూ మండిపడ్డారు. ప్రజా జీవితంలో ఉన్నాం కదా అని ఓపిక పడుతున్నానని, మీ అమ్మనో, చెల్లినో, భార్యనో ఇలాంటి మాటలు అంటుంటే వింటారా అంటూ ప్రశ్నించారు. నా భార్య బిడ్డలను తిడితే నాకు నొప్పి వస్తదని, ఒక ఆడబిడ్డను తిడుతుంటే మీకు నొప్పి కాదా అని అడిగారు. ఏ సంస్కృతిలో బతుకుతున్నారని నిలదీశారు. ఒక ముఖ్యమంత్రిగా ఒక్కొక్కడి తోడ్కలు తీస్తా అని, బట్టలిప్పదీసి రోడ్ల మీద తిప్పిస్తా అని మాస్ వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు హైదరాబాద్ ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. కాలుష్య నియంత్రణ కోసం మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను పెంచుతున్నట్లు ప్రకటించారు. అదే విధంగా ఎలక్ట్రిక్ ఆటోలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.








