Mahaa Daily Exclusive

  గ్రూప్‌-1 అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయాలి – ఎమ్మెల్సీ కవిత

Share

గ్రూప్‌-1 పరీక్షలు, ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న ఆనుమానాలను ప్రభుత్వంతో పాటు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నివృత్తి చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. పేపర్ల మూల్యాకనంలో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందని అభ్యర్థులు తన దృష్టికి తెచ్చారని తెలిపారు. ట్రాన్స్‌లేషన్‌ సమస్య వల్ల ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు సరిగ్గా మూల్యాంకనం చేయలేకపోయారని, తద్వారా మార్కుల్లో వ్యత్యాసాలు వచ్చాయని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని ఆమె వివరించారు. గ్రూప్‌-1 పరీక్షల్లో ప్రిలిమ్స్‌కి ఒక హాల్‌ టికెట్‌ నంబర్‌, మెయిన్స్‌కి మరొక హాల్‌టికెట్‌ నంబర్‌ కేటాయించడం వల్ల విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ప్రస్తావించారు. ఇటీవల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసిన గ్రూప్‌ – 2 ఫలితాల్లో దాదాపు 13 వేల మంది అభ్యర్థుల ఫలితాలు వెల్లడించలేదని, ఏ కారణం చేత 13 వేల మందిని ఇన్వాలీడ్‌గా ప్రకటించిందో చెప్పాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. గ్రూప్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో 11 విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్సీ కవితను కలిసి చర్చించారు. తాము వ్యక్తపరుస్తున్న అనుమానాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని, శాసనమండలిలో ఈ అంశాన్ని లేవనెత్తాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు.