Mahaa Daily Exclusive

  ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై కాంగ్రెస్ విప్ జారీ….

Share

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై కాంగ్రెస్ విప్ జారీ.
* ఆగస్టు 10 నుంచి మూడు రోజుల హాజరు తప్పనిసరి.
* ఉభయ సభల సభ్యులకు అధిష్ఠానం కీలక ఆదేశాలు.

ఢిల్లీ, మహా.

వివాదాస్పద విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) సవరణ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ ఉభయ సభల సభ్యులకు విప్ జారీ చేసింది. ఆగస్టు 10, 11, 12 తేదీల్లో లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలకు కాంగ్రెస్ ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. పార్టీ వైఖరికి అనుగుణంగా సభలో వ్యవహరించాలని స్పష్టం చేసింది.

రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ విప్ జైరామ్ రమేశ్ ఈ మేరకు అధికారిక విప్ జారీ చేశారు. ఆగస్టు 10 నుంచి 12 వరకు రాజ్యసభలో అత్యంత కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నందున సభ్యులందరూ ఉదయం 11 గంటల నుంచి సభ వాయిదా పడే వరకు తప్పనిసరిగా హాజరై పార్టీ నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని సూచించారు. ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంతో పరిగణించాలని సభ్యులను కోరారు.

లోక్‌సభలోని కాంగ్రెస్ సభ్యులకు కూడా ఇదే తరహా విప్ జారీ అయింది. మూడు రోజుల పాటు ఎవరూ గైర్హాజరు కాకుండా సభకు హాజరై పార్టీ నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించాలని పార్టీ స్పష్టం చేసింది. అలాగే ఇండియా కూటమిలోని మిత్రపక్షాలకు కూడా సమాచారం ఇచ్చి, వారి సభ్యులందరూ సభకు హాజరుకావాలని కాంగ్రెస్ కోరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉండగా, ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లును కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ముందస్తుగా సభ్యులకు విప్ జారీ చేసినట్లు తెలుస్తోంది.

అయితే వచ్చే వారం పార్లమెంట్‌లో చేపట్టనున్న తాత్కాలిక ప్రభుత్వ కార్యక్రమాల జాబితాను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ విడుదల చేసినప్పటికీ, అందులో ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు లేదా డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించిన ఎలాంటి ప్రస్తావన లేదు. అయినప్పటికీ ఈ బిల్లులు ఎప్పుడైనా సభ ముందుకు వచ్చే అవకాశం ఉందనే అంచనాతో కాంగ్రెస్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.