పార్లమెంట్ ప్రజాస్వామ్యానికి అత్యున్నత దేవాలయం.
* కొత్త ఎంపీలకు మాట్లాడే అవకాశం కల్పించాలి.
* ఎన్‌డీఏ కుటుంబంలో అందరికీ సమాన గౌరవం.
* ప్రధాని నరేంద్ర మోదీ.
ఢిల్లీ, మహా.
ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ అత్యున్నత దేవాలయమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో తరచూ చోటుచేసుకుంటున్న ఆందోళనలు, అంతరాయాల కారణంగా కొత్తగా ఎన్నికైన ఎంపీలకు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే అవకాశం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సభ సజావుగా సాగితేనే ప్రజల సమస్యలు సమర్థవంతంగా చర్చకు వస్తాయని, ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎన్‌డీఏ ఎంపీలతో శుక్రవారం తన నివాసంలో నిర్వహించిన అల్పాహార సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ చరిత్రను లోతుగా అధ్యయనం చేయాలని, గతంలో జరిగిన చర్చలు, తీర్మానాలు, చారిత్రక సందర్భాలపై అవగాహన పెంచుకోవాలని ఎంపీలకు సూచించారు. ప్రజల తరఫున మాట్లాడేటప్పుడు వాస్తవాలు, సమాచారం ఆధారంగా సమర్థవంతమైన ప్రసంగాలు చేయాలని ఆయన కోరారు.
దేశాభివృద్ధి రాష్ట్రాల అభివృద్ధిపైనే ఆధారపడి ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. ప్రతి ఎంపీ తన నియోజకవర్గ అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని సూచించారు. అభివృద్ధి పనుల అమలులో ఎలాంటి సమస్యలు ఎదురైనా నేరుగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించవచ్చని చెప్పారు. పేదలు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత సహా అన్ని వర్గాల ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
ఈ సమావేశానికి శివసేనకు చెందిన ఏడుగురు ఎంపీలు, ఎన్‌సీపీ (శరద్ పవార్ వర్గం) నుంచి 20 మంది, ఎన్‌సీపీ (అజిత్ పవార్ వర్గం) నుంచి ఇద్దరు ఎంపీలు సహా మొత్తం సుమారు 45 మంది ఎన్‌డీఏ సభ్యులు హాజరయ్యారు. ఇటీవల ఇతర పార్టీల నుంచి ఎన్‌డీఏలో చేరిన ఎంపీలతో ప్రధాని ప్రత్యేకంగా మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు.
ఎన్‌డీఏ ఒక రాజకీయ కూటమి మాత్రమే కాదని, అది ఒక కుటుంబమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ కూటమిలోని ప్రతి పార్టీకి, ప్రతి ఎంపీకి సమాన గౌరవం ఉంటుందని స్పష్టం చేశారు. తాను ఒక పార్టీకి మాత్రమే ప్రధాని కాదని, ఎన్‌డీఏలోని ప్రతి ఎంపీకి అండగా ఉంటానని పేర్కొంటూ ఎలాంటి సందేహాలు, ఆందోళనలు అవసరం లేదని ధైర్యం చెప్పారు.
సమావేశం అనంతరం ప్రతి ఎంపీతో విడివిడిగా మాట్లాడిన ప్రధాని, వారి నియోజకవర్గాల పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సమస్యలపై ఆరా తీశారు. అంతకుముందు రోజు కూడా బీజేపీకి చెందిన 37 మంది ఎంపీలతో తన నివాసంలో విందు సమావేశం నిర్వహించిన మోదీ, పాలన, పార్లమెంటు వ్యవహారాలు, ప్రజా సేవలపై చర్చించారు. ఢిల్లీలోని రాజకీయ ప్రచారాల ప్రభావానికి లోనుకాకుండా ప్రజలతో నిరంతరం అనుబంధం కొనసాగించాలని, ప్రతిపక్ష సభ్యులతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేయాలని ఎంపీలకు సూచించినట్లు సమాచారం.







