తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యం.
• సంస్థాగత బలంతో ప్రభుత్వ ఏర్పాటు ఖాయం.
• గ్రాడ్యుయేట్, జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై కార్యాచరణ సిద్ధం.
• బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు.
ఢిల్లీ, మహా.
రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. సంస్థాగత బలమే పార్టీ విజయానికి ప్రధాన బలమని పేర్కొంటూ, రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అధ్యక్షతన జరిగిన పార్టీ ఉన్నతస్థాయి సమావేశంలో రాష్ట్ర ఇన్‌చార్జి అభయ్ పాటిల్, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కలిసి రాంచందర్ రావు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, తెలంగాణలో పార్టీ భవిష్యత్ వ్యూహాలపై జాతీయ నాయకత్వం స్పష్టమైన దిశానిర్దేశం చేసిందని తెలిపారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో పోటీ చేసి గణనీయమైన ఓటు బ్యాంకును సాధించామని, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రజలు బీజేపీని ఆదరించారని గుర్తుచేశారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని, సరైన సమయంలో వారి చేరికలు ఉంటాయని చెప్పారు. డీలిమిటేషన్ అనంతరం నియోజకవర్గాల సంఖ్య పెరిగినా బీజేపీ మెజారిటీ సాధించి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
2014 తర్వాత పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో పార్టీ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన తరహాలోనే తెలంగాణలో కూడా బీజేపీ సంస్థాగతంగా మరింత పటిష్ఠంగా ఉందని రాంచందర్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి మండలంలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సూచించినట్లు తెలిపారు.
సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపైనా సమావేశంలో చర్చించినట్లు వెల్లడించారు. వరంగల్–ఖమ్మం–నల్గొండ, హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గాలను బీజేపీ కైవసం చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అలాగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. జనసేన వంటి పార్టీలు జాతీయ స్థాయిలో ఎన్డీయేలో భాగస్వాములైనా, తెలంగాణలో పొత్తుల అంశంపై ఎలాంటి నిర్ణయం లేదని తెలిపారు.
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు పార్లమెంట్‌లో తప్పకుండా ఆమోదం పొందుతాయని రాంచందర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ తీసుకొచ్చే ప్రతి మంచి నిర్ణయాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించడం అలవాటుగా మార్చుకుందని విమర్శించారు.
పార్టీలో నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, చిన్నచిన్న అభిప్రాయ భేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని ఆయన చెప్పారు. బీజేపీలో పాత, కొత్త అనే తేడా లేదని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ కార్యకర్తగా, నాయకుడిగా సమాన అవకాశాలు పొందుతారని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఎస్‌ఐఆర్ కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ఇతర కార్యక్రమాల వేగం తగ్గినా, జిల్లా, రాష్ట్ర స్థాయి సమావేశాలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిని ప్రజల ముందుకు తీసుకెళ్లడం, ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేయడమే బీజేపీ ప్రధాన కార్యాచరణ అని పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కోర్ కమిటీ సభ్యులతో చర్చించి పాదయాత్రలు, బస్సు యాత్రలు వంటి విస్తృత ప్రజా చైతన్య కార్యక్రమాలను చేపట్టి పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్తామని రాంచందర్ రావు వెల్లడించారు.






