చేనేత అభివృద్ధికి కేంద్రం పూర్తి ప్రాధాన్యం.
* ప్రపంచ వస్త్ర కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యం.
* నేతన్నల సంక్షేమానికి కేంద్రం అండగా నిలుస్తుంది.
* కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి.
ఢిల్లీ, మహా.
చేనేత, వస్త్ర పరిశ్రమ భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రంగమని, కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తూ దేశ విదేశీ మారకద్రవ్య ఆదాయంలో విశేష పాత్ర పోషిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని నేతన్నలకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన, భారతీయ చేనేతకు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’తో పాటు 5ఎఫ్ విజన్– ఫామ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాబ్రిక్, ఫ్యాబ్రిక్ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్ మార్కెట్స్ విధానాన్ని అమలు చేస్తూ వస్త్ర రంగాన్ని బలోపేతం చేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. 2030 నాటికి వస్త్ర ఎగుమతులను రూ.9 లక్షల కోట్లకు పెంచే లక్ష్యంతో అనేక ప్రోత్సాహక పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు.
వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పించే రంగాల్లో వస్త్ర పరిశ్రమ ఒకటని పేర్కొన్న ఆయన, దేశవ్యాప్తంగా దాదాపు ఐదు కోట్ల మందికి ఈ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోందని వివరించారు. భారతదేశాన్ని ప్రపంచ వస్త్ర తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందన్నారు.
పీఎల్ఐ పథకం, పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులు, నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, రా మెటీరియల్ సప్లై స్కీమ్, వీవర్స్ ముద్రా స్కీమ్ వంటి పథకాల ద్వారా నేతన్నలకు ఆధునిక మగ్గాలు, ముడి సరుకు, వర్క్‌షెడ్లు, డిజైన్ అభివృద్ధి, మార్కెటింగ్ సదుపాయాలు, రుణాలు, సామాజిక భద్రత వంటి అనేక రకాల సహాయాన్ని అందిస్తున్నామని వెల్లడించారు.
తెలంగాణలో చేనేత, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాలో పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ పార్కులో సాంప్రదాయ చేనేతతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వస్త్ర తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
తెలంగాణ పత్తి రైతులు దేశ వస్త్ర పరిశ్రమకు వెన్నెముకలాంటివారని పేర్కొన్న ఆయన, వారి నుంచి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కింద రూ.69,860 కోట్లకు పైగా విలువైన పత్తిని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు. రైతులు, నేతన్నల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఆటోమేషన్, అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలను వస్త్ర రంగంతో అనుసంధానం చేస్తూ ఉత్పాదకత, నాణ్యత, మార్కెట్ అవకాశాలను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. సంప్రదాయ చేనేత కళను పరిరక్షిస్తూ నేతన్నల ఆదాయాన్ని పెంచి, భారతీయ చేనేత ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లలో మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. అలాగే ప్రతి భారతీయుడు చేనేత వస్త్రాలను ఆదరించి నేతన్నలకు తోడ్పాటు అందించాలని ఆయన పిలుపునిచ్చారు.







