Mahaa Daily Exclusive

  టీడీపీలో కార్యకర్తకే అగ్రతాంబూలం ఉత్తమ కార్యకర్తల సమావేశంలో లోకేష్…!

Share

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలపై జూన్ నుంచి ఇంటింటి ప్రచారం నిర్వహించాలి, పెన్షన్లు, అన్నక్యాంటీన్, స్టీల్ సిటీ, ఎన్ టిపిసి, బల్క్ డ్రగ్ పార్కు వంటి విజయగాధలను ప్రజల్లోకి తీసుకెళ్లండని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. చేసిన పనులు చెప్పుకోకపోతే ప్రత్యర్థులు చెప్పే అబద్ధాలు జనంలోకి వెళ్తాయి, ఈ విషయంలో పార్టీ కేడర్ అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో ఉత్తమ కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఇటీవల నేను డిల్లీలో ఒక ఫంక్షన్ కు వెళ్లాను, అక్కడ మన సభ్యత్వం గురించే చర్చ జరుగుతోందన్నారు. 5లక్షలు చేయలేకపోతున్నాం, కోటి సభ్యత్వాలు ఎలా చేశారని అడిగారన్నారు, ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు హయాం నుంచి సభ్యత్వం మనకు ఒక ఎమోషన్, యలమంచిలి నియోజకవర్గంలో 41వేలసభ్యత్వం చేసినందుకు అభినందనలు. యువగళం పాదయాత్రలో కష్టపడిన కార్యకర్తలను గుర్తించాలని ఇక్కడ కార్యకర్తలు నాకు చెప్పారు. బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ, సోషల్ మీడియా, సభ్యత్వ నమోదులో మెరుగైన పనితీరు కనబర్చిన వారివివరాలను ఆన్ లైన్ లో పెట్టా. ఎవరు పనిచేస్తున్నారో తెలుసుకునేందుకు ఈ విధానం అమలు చేస్తున్నామన్నారు. టీడీపీలో కష్టపడిన కార్యకర్తలకే నామినేటెడ్ పదవులు ఇస్తాం, ఈ విషయంలో క్లారిటీతో ఉన్నాం, కష్టపడి పార్టీ కోసం పనిచేయండన్నారు. మన ప్రభుత్వం అయిదేళ్లు ఉంటుంది, తొలిసారి అవకాశం రాకపోయినా మూడువిడతల్లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తాం, అధైర్యపడవద్దన్న భరోసాను ఇచ్చారు.

అలకలు మాని పార్టీకోసం పనిచేయండి

మే తర్వాత కేడర్ అంతా ప్రజల్లోకి వెళ్లాలి, మే నెలలో కడపలో మహానాడు నిర్వహించబోతున్నాం. ఈలోగా కుటుంబ సాధికార సమితులు, బూత్, క్లస్టర్ కమిటీలు, అనుబంధ సంఘాలు, జిల్లా కమిటీల నియమకాన్ని పూర్తిచేస్తామన్నారు. మహానాడులో జాతీయ అధ్యక్షుడి ఎన్నిక తర్వాత రాష్ట్ర కమిటీ నియమాకం చేపడతామని, పార్టీ కేడర్ అంతా ప్రతి 3నెలలకు ఒకసారి ప్రజల్లోకి వెళ్లాలన్నారు. జగన్ పై కంటే పార్టీ కార్యకర్తల కోసమే నేను ఎక్కువగా పోరాడుతుంటాను, సమస్యలపై నిర్ణయం తీసుకునే వరకు అందరం కూర్చుని చర్చిద్దాం, ఒకసారి నిర్ణయం తీసుకున్నాక అందరం కలిసి పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. అలకలుమాని నమ్ముకున్న సిద్ధాంతం కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఇకపై నిరంతరం యువరక్తం ఎక్కిస్తాం

ఇకపై పార్టీలో నిరంతరం యువరక్తం నింపాలని నిర్ణయించామని, యువత రాజకీయాల్లోకి రావాలి, ఏ నాయకుడు కూడా ఒకే పదవిలో మూడుసార్లకు మించి ఉండకూడదని ప్రతిపాదిస్తున్నామన్నారు. గ్రామస్థాయి అధ్యక్షుడికి కూడా పొలిట్ బ్యూరోలో స్థానం లభించే పరిస్థితి రావాలని, పార్టీలో కరుడుగట్టిన కార్యకర్తలంతా అయిదేళ్లు నరకం అనుభవించారన్నారు, ఎన్నో కేసులు పెట్టి హింసించారు, హోంమంత్రి అనితపై కూడా 23కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. పాదయాత్ర సమయంలో పోలీసులు నాకు సెక్యూరిటీ అడిగితే ఇవ్వలేదు, ఇప్పుడు వద్దంటే వస్తున్నారన్నారు. రామతీర్థం వెళ్లడానికి బాబుగారు విశాఖ ఎయిర్ పోర్టుకు వస్తే రోడ్డుకు అడ్డుగా పొక్లయినర్లు పెట్టారన్నారు. పాదయాత్ర సమయంలో నా స్టూల్, మైక్ లాక్కున్నారని గుర్తు చేశారు. ఈరోజు టైం బాగుంది కదా అని గతాన్ని మర్చిపోవద్దు, కుటుంబంలో మాదిరి పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు ఉంటాయి, పరిష్కరించుకొని ముందుకు సాగాలన్నారు.

ఓర్పు, సహనంతో ప్రజల్లోకి వెళ్లండి

టీడీపీలో కార్యకర్తే ఫస్ట్, కేడర్ కార్యాలయాలకు వెళ్లి చట్టపరంగా పరిష్కరించరించగలిగిన సమస్యలను స్థానికంగా పరిష్కరించేందుకు చొరవచూపాలన్నారు. మే నెల నుంచి ప్రతిరోజూ 300మందికి చొప్పున పార్టీ కేడర్ కు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించుకోవాలన్నారు. ఇతర పార్టీ ఎమ్మెల్యే ఉన్నచోట సమన్వయ లోపం కారణంగా సమస్యలు వస్తున్నాయని, ఎమ్మెల్యే లేనిచోట అక్కడ ఇన్ చార్జి ప్రతివారం కూర్చుని మాట్లాడుకోవాలన్నారు. చట్ట పరిధిలోని పనుల కోసం కార్యకర్తలు కార్యాలయాలకు వెళితే పనులు చేయాల్సిందేనని, సహనంతో ప్రజల్లోకి వెళ్లాలని మంత్రి లోకేష్ కార్యకర్తలను కోరారు. ఈ సందర్భంగా ఉత్తమ కార్యకర్తలను మంత్రి లోకేష్ అభినందించారు. సభ్యత్వం, మన టీడీపీ, భవిష్యత్తుకు గ్యారంటీ వంటి అంశాల్లో అవార్డు అందుకున్న కార్యకర్త ధర్మాల ఆదిరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.

తప్పుడు కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకుంటాం

ఈ సమావేశంలో పలు సమస్యలను కార్యకర్తలు మంత్రి లోకేష్ దృష్టికి తెచ్చారు. వైకాపా
సర్పంచ్ లతోపాటు 10 శాతం పైసీపీ వారు కూడా టీడీపీ సభ్యత్వ కార్డులు తీసుకున్నారని తెలిపారు. అచ్యుతాపురం సెజ్ కు సంబంధించి ఆర్ అండ్ ఆర్ లో ఇంకా 200 మందికి స్థలాలు ఇవ్వలేదని, ఆ సమస్యను పరిష్కరించాలని కోరారు. పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని, ఉపాధి హామీ, నీరు-చెట్టు బిల్లులు చెల్లించాలని, కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని కోరారు. ఉపాధి హామీ, నీరు-చెట్టు బిల్లులు, తప్పుడు కేసులకు సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని సంప్రదించాలని మంత్రి లోకేష్ కోరారు.
ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ దామచర్ల సత్య, యలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి ప్రగడ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు