ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. పవన్ కు ఫోన్ చేసిన ప్రధాని మోడీ కుమరుడి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. సింగపూర్ లోని ఓ స్కూల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ గాయపడిన విషయం తెలిసిందే. కాలిన గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటన గురించి తెలిసిన వెంటనే మన్యం జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కు ప్రధాని ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు పలువురు ప్రముఖులు స్పందించి, మార్క్ ఆరోగ్యంపై ఆరా తీశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ మరికాసేపట్లో ప్రత్యేక విమానంలో వైజాగ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. రాత్రి సోదరుడు చిరంజీవి, వదిన సురేఖలతో కలిసి సింగపూర్ బయల్దేరి వెళ్లారు.
సీఎం రేవంత్ ఎమోషనల్ పోస్ట్
సింగపూర్ లో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో గాయపడ్డారన్న విషయం తెలియగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనపై స్పందించారు. మార్క్ శంకర్ త్వరగా కోలువాలంటూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి… శ్రీ కొణిదెల పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్… సింగపూర్ లోని పాఠశాలలో జరిగిన ప్రమాదంలో గాయపడటం… దిగ్భ్రాంతికి గురి చేసింది. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. అని ట్వీట్ చేశారు.
మార్క్ శంకర్ కు గాయాలపై చంద్రబాబు స్పందన
మార్క్ శంకర్ కు గాయాలైన విషయం ఆందోళన కలిగించిందని ఏపీ సీఎం ఛంద్రబాబు అన్నారు. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మన్యం జిల్లా ఫర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసిన చంద్రబాబు కుమారుడి ప్రమాద ఘటనపై అడిగి వివరాలను తెలుసుకున్నారు.
వైఎస్ జగన్ స్పందన
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన ఘటనపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన ఆయన బాబు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. “సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలిసి నేను షాక్ అయ్యాను. అందులో పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడని తెలిసింది. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు ఆ కుటుంబంతోనే ఉంటాయి. మార్క్ శంకర్ త్వరగా, పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని జగన్ ఎక్స్ పోస్టులో రాసుకొచ్చారు.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి లోకేశ్
బాబు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు లోకేశ్ ట్వీట్
మార్క్ శంకర్ ఘటనపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలుడు త్వరగా కోలుకోవాలని, ఈ కష్ట సమయంలో పవన్ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు లోకేశ్ ట్వీట్ చేశారు. “సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి విని షాక్ అయ్యాను. అందులో అన్న పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలు అయ్యాయని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. బాబు త్వరగా, పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో పవన్ కుటుంబానికి బలం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని మంత్రి లోకేశ్ రాసుకొచ్చారు.
చిరంజీవి, కేటీఆర్ స్పందన
సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడినట్టు తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. సింగపూర్ లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్టు తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యానని కేటీఆర్ అన్నారు. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
ఈ ప్రమాదంపై మార్క్ శంకర్ పెదనాన్న చిరంజీవి స్పందించారు. 8 ఏళ్ల వయసు ఉన్న మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి బాగుందని తెలిపారు. కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయని వెల్లడించారు. మొదట ప్రమాద ఘటన గురించి తెలుసుకుని షాకయ్యామన్నారు.
ఈ ప్రమాదం ఎంతో కలచివేసిందన్న రోజా
సింగపూర్ ప్రమాదం, పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డ ఘటనపై మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా స్పందించారు. “ఈ రోజు పవన్ కల్యాణ్ గారి చిన్నబాబు మార్క్ శంకర్ ప్రమాద వార్త నా మనసును ఎంతో కలచివేసింది. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని, దీర్ఘాయుష్షు కలిగి ఆరోగ్యవంతుడై కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలని భగవంతుడ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను” అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
త్వరగా కోలుకోవాలన్న సీపీఐ నారాయణ
స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ పవన్ కుమారుడు శంకర్ త్వరగా కోలుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఒక ప్రకటనలో ఆకాంక్షించారు.








