ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారు జామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని, స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆ తర్వాత అన్నా లెజినోవా అఖిలాండం వద్దకు చేరుకుని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అంతకుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. తమ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో అగ్ని ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడటంతో అన్నా లెజినోవా శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆదివారం సాయంత్రమే ఆమె తిరుమలకు చేరుకున్నారు.
తలనీలాలు సమర్పణ
అన్యమతస్థురాలు కావడంతో మొదట గెస్ట్‌హౌస్‌లో టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్‌పై సంతకం చేశారు. క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ఆమె తొలుత శ్రీభూవరాహస్వామి ఆలయం వద్దకు చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీపద్మావతి ఎంక్వైరీ సెంటర్ వద్ద ఉన్న కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. స్థానికంగా ఉన్న గాయత్రీ నిలయంలో అన్నా లెజినోవా బస చేశారు.
కుమారుడు మార్క్ శంకర్ పేరిట విరాళం
టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నదానం ట్రస్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా భారీ విరాళం ఇచ్చారు. తమ కుమారుడు మార్క్ శంకర్ పేరు మీద రూ.17లక్షల చెక్కును సంబంధిత అధికారులకు అందజేశారు. మధ్యాహ్నం అన్నవితరణకు అయ్యే ఖర్చును విరాళంగా ఇచ్చారు. మధ్యాహ్నం వచ్చి భక్తులతో కలిసి భోజనం చేశారు.







