Mahaa Daily Exclusive

  దేశంలోనే రోల్ మాడల్ గా భూ భారతి భూస‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే అధికారులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి…!

Share

భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే అధికారులు వ‌చ్చి పైసా ఖ‌ర్చులేకుండా ప‌రిష్క‌రించే విధానం నిరంత‌ర ప్ర‌క్రియ‌గా సాగుతుంద‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌క‌టించారు. భూభార‌తి చ‌ట్టం పైల‌ట్ ప్రాజెక్ట్ ను గురువారం నారాయ‌ణ‌పేట్ జిల్లా మ‌ద్దూర్ మండ‌లం కాజీపూర్‌లో లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలో 2025 భూ భార‌తి చ‌ట్టం ఒక రోల్ మోడ‌ల్‌గా నిలుస్తుంద‌న్నారు. 2020 రెవెన్యూ చ‌ట్టం వ‌ల‌్ల ప్ర‌జ‌లు అధికారుల చుట్టూ తిరిగారు, 2025 భూభార‌తి చ‌ట్టం వ‌ల‌న అధికారులే ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వ‌చ్చి ద‌ర‌ఖాస్తులు తీసుకొని నిర్ణీత కాల‌వ్య‌వ‌ధిలో ప‌రిష్క‌రిస్తారు. అంతేగాక కొత్త చ‌ట్టం వ‌ల‌న ప్రజ‌ల‌కు పైసా ఖ‌ర్చులేకుండా ప‌ని జ‌రుగుతుంది. ఇక‌పై గ్రామాల‌లో భూస‌మ‌స్య‌ల‌పై జ‌వాబుదారీత‌నం ల‌భించేలా త్వ‌ర‌లో గ్రామ‌ప‌రిపాల‌నాధికారుల నియామకం జరుగుతుందన్నారు. ఇంత‌వ‌ర‌కు అక్ర‌మ‌ దారిలో కొంత‌మంది అక్ర‌మార్కులు స్వాధీనం చేసుకున్న ప్ర‌భుత్వ‌, రైతుల భూముల‌ను తిరిగి వెన‌క్కుతీసుకుంటామని, కోర్టులో లేని భూ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామన్నారు. భూముల రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో స‌ద‌రు ఆస్ది వివ‌రాలు క‌లిగిన మ్యాప్‌ను కూడా జ‌త‌చేసేలా చర్య‌లు ప్రారంభ‌మ‌య్యాయని, ప్ర‌జ‌ల‌కు ఈ సౌక‌ర్యం క‌ల్పించేందుకుగాను సుమారు ఆరు వేల మంది లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల‌ను నియ‌మించ‌బోతున్నామని మంత్రి ప్రకటించారు.

సామాన్యుల భూముల‌కు భ‌ద్ర‌త భ‌రోసా క‌ల్పించేలా భూ భార‌తి చ‌ట్టంలో అనేక కొత్త నిబంధ‌న‌లు ప్ర‌వేశ‌పెట్టామని, మే 1 నుంచి పైల‌ట్ ప్రాజెక్ట్‌లు ప్రారంభ‌మైన 4 జిల్లాల‌ను మిన‌హాయించి మిగిలిన 28 జిల్లాల‌లో 28 మండ‌లాల‌ను ప్ర‌యోగాత్మ‌కంగా తీసుకుంటామన్నారు. తొలి 4 పైల‌ట్ ప్రాజెక్ట్ మండ‌లాల్లో స‌మ‌స్య‌ల‌ను జూన్ 2 రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం నాటికి పూర్తిగా ప‌రిష్క‌రిస్తామన్నారు. అదే ప‌ద్ద‌తిని రానున్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు చేస్తామన్నారు. ప్ర‌జ‌ల‌కు మేలు చేసే భూ భార‌తి చ‌ట్టాన్ని అడ్డుకోవ‌డానికి ప్ర‌తిప‌క్షాలు నిస్సిగ్గుగా ప్ర‌య‌త్నించాయని, ధ‌ర‌ణి వ‌ల్ల ఎన్నో భూస‌మ‌స్య‌లు ఉన్న ప్ర‌తిప‌క్ష‌స‌భ్యులు ఈ చ‌ట్టంతో వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించుకోవ‌చ్చన్నారు. భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం ఈ భూభారతి చూపిస్తుందన్నారు. దీనిని ప్రతిప‌క్షాలు పొగ‌డ‌క‌పోయినా రైతన్న‌ల‌ను దృష్టిలో పెట్టుకొని దుష్ప్ర‌చారం చేయ‌వ‌ద్దని కోరారు. ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం పేద‌ల సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉందని, ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో స‌హా ఎంద‌రో ప్ర‌ముఖుల ఆలోచ‌న‌ల‌తో అక్ష‌ర రూపం దాల్చిన భూభార‌తి మ‌రో వందేళ్ల‌పాటు వ‌ర్ధిల్లుతుంద‌ని మంత్రి పొంగులేటి అన్నారు.