భాగ్యనగరంలో భారత్ సమ్మిట్ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. శుక్రవారం నుంచి జరిగే ఈ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో నిపుణులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచశాంతి, అహింస, న్యాయం, పెట్టుబడులే లక్ష్యంగా ఈ సమ్మిట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ‘ఈ సమ్మిట్‌లో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన నాయకులు, నిపుణులకు తెలంగాణ ప్రభుత్వ విజన్ గురించి వివరిస్తాం. ఇందిరా మహిళా శక్తి బజార్లు, గ్రామాల్లో ఉపాధి కల్పన తదితర అంశాల గురించి చెబుతాం. ఎకనమిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, సోషల్ జస్టిస్, జెండర్ జస్టిస్, యూత్ జస్టిస్, ఎకలాజికల్ జస్టిస్, పీస్ జస్టిస్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తాం’’ అని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాల నుండి 450 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు. అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి కాంగ్రెస్ పార్టీ మూల సూత్రాలపై దృష్టి సారించి, నెహ్రూ గారి నాన్-అలైన్మెంట్ ఉద్యమ స్ఫూర్తిని ఆధారంగా తీసుకుని, ఈ సమ్మిట్ ప్రపంచ సమస్యలపై చర్చకు వేదికగా నిలవనుంది. రాహుల్ గాంధీ ఆలోచనల ప్రకారం, ప్రపంచానికి భారత్ నేతృత్వాన్ని ప్రదర్శించేందుకు ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఈ సమ్మిట్ ద్వారా ప్రజాస్వామ్య విలువలకు మళ్లీ జీవం పోసే ప్రయత్నం జరుగుతుంది అని భట్టి వివరించారు. ఏర్పాట్లను భట్టి విక్రమార్కతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ సదస్సుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, ఖర్గే, ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్ హాజరయ్యే అవకాశాలున్నాయి.
కార్యక్రమాలు ఇలా
– ఉదయం 7.30 కు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన ఎలా జరుగుతోంది అనే అంశంపై క్షేత్రస్థాయిలో అవగాహన.
– ఉదయం 10.30 నుండి లింగ సమానత్వం, మహిళా హక్కులపై చర్చ, మధ్యాహ్నం సమాచార వాస్తవాలు అపోహలపై చర్చ.
– మధ్యాహ్నం 2.45కు యువత భవిష్యత్తు రాజకీయాల్లో పాత్రపై చర్చ. తర్వాత కొత్త ప్రపంచ కూటముల దిశగా చర్చ.
– తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రెజెంటేషన్. అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపై రాష్ట్ర విజన్ పంచడం.
– 26న విభేదాలను అధిగమించేందుకు సమవైభవంపై చర్చ, వాతావరణ న్యాయం, ఆర్థిక న్యాయం అనిశ్చిత కాలంలో ఎలా సాధించాలో చర్చ, శాంతి, న్యాయం, మరియు బహుళ ధ్రువ ప్రపంచంలో వాటి ప్రాధాన్యం, ముగింపు సదస్సు, తర్వాత ఇందిరా మహిళాశక్తి బజార్ సందర్శన. మహిళల స్వయం సహాయక సంఘాల బజార్ సందర్శన, కార్యకలాపాల పరిచయం.








