Mahaa Daily Exclusive

  ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష భారీ మూల్యం చెల్లించుకుంటారని వ్యాఖ్య బీహార్ సభలో పహల్గాం ఘటనపై మోదీ స్పందన..!

Share

పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడ్డ ముష్కరులకు ఊహించని రీతిలో శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని, వారిని మట్టిలో కలిపి సమయం ఆసన్నమైందన్నారు. ఇది పర్యటకులపై జరిగిన దాడి కాదని, భారత్‌ ఆత్మపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ప్రతి ఉగ్రవాదిని గుర్తించి, వెంటాడి భారత్ హతమారుస్తుందని స్పష్టం చేశారు. గురువారం బీహార్ మధుబనిలో పంచాయతీరాజ్ దినోత్సవంలో పాల్గొన్న మోదీ, పహల్గాం ఉగ్రదాడిపై తొలిసారి మాట్లాడారు. ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఉగ్రదాడికి పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకుంటారని పేర్కొన్నారు. తొలుత తన ప్రసంగం ఆరంభంలో పహల్గాం మృతులకు ప్రధాని నివాళులర్పించారు. మోదీతో పాటు సభలోని వారంతా ఒక నిమిషం పాటు మౌనం పాటించి అంజలి ఘటించారు.

కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉందని మోదీ తెలిపారు. క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. ఉగ్రదాడి కారణంగా ఓ తల్లి కుమారుడిని కోల్పోయిందని, ఓ సోదరికి జీవిత భాగస్వామి దూరమయ్యాడని అన్నారు. కార్గిల్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరిలోనూ బాధ, ఆగ్రహం ఉన్నాయని చెప్పారు. బాధితులకు న్యాయం చేసేందుకు ప్రతి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు దేశం మొత్తం దృఢ సంకల్పంతో ఉందని చెప్పారు. ఉగ్రమూకల వెన్నెముకను 140 కోట్ల మంది విరిచేస్తారని మోదీ హెచ్చరించారు. భారత్‌కు అండగా నిలిచిన దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ తమకు అండగా నిలిచారని అన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఉగ్రవాదంతో భారత ఐకమత్య స్ఫూర్తిని బద్దలుకొట్టలేరని మోదీ స్పష్టం చేశారు.