తెలుగు సాహిత్యరంగంలో గత నాలుగు దశాబ్దాలుగా తనదైన శైలితో, నిశితమైన తాత్త్విక దృక్కోణంతో, ప్రజల బోధకుడిగా, ఉద్యమాల పోరాటగీతాల కర్తగా, జర్నలిస్టుగా బహుముఖంగా సాహిత్యాన్ని సర్వజనల అభివృద్ధికి వేదికగా మలిచిన ప్రముఖ కవి, రచయిత తిర్మల్ 40 ఏళ్ల సాహిత్య ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. విప్లవోద్యమాలకు అనుసంధానంగా ప్రజల బాధల్ని గళంగా మలచిన ఈ సాహితీయోధుడి కవిత్వం, రచనలు, ఉద్యమపాటలు ఖమ్మం జిల్లా నుంచే దేశవ్యాప్తంగా స్పందింపజేశాయి. మహాకవి శ్రీశ్రీ నుంచి లభించిన సాహితీ స్ఫూర్తి, మాచర్ల విరసం మహాసభల అనుభవం, ఖమ్మం విరసం కార్యవర్గ కార్యకలాపాలు, ‘ఉద్యమగానం’ సంకలనం ద్వారా ప్రజల ఆశయాలను కవిత్వమార్గంగా విప్లవంగా ఆలపించిన తిర్మల్ తెలుగు సాహిత్యంలో విలక్షణంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన సాహిత్య ప్రస్థానాన్ని, విప్లవ భావాలను, ఉద్యమ గాత్రాన్ని విశ్లేషిస్తూ ఈ ప్రత్యేక నివేదిక…
* విప్లవోన్ముఖంగా సాగిన సాహిత్య ప్రయాణం.
తిర్మల్ కవిత్వానికి మూలస్రోతస్వినిగా ప్రజల మట్టిసువాసన, దమ చిందిన కష్టాలు, పోరాటాల జ్ఞాపకాలే. తాను ఓ సాధారణ రచయిత కాదు… ప్రజల స్వరాన్ని కవిత్వంగా మలిచిన యోధుడు. శ్రీశ్రీ సన్నిహితంగా ఉన్న అనుభవం తిర్మల్ పై చెరగని ముద్ర వేసింది. “కవిత్వం అనేది తాత్విక గళం కాదు, అది ప్రజల కేక” అని త్రిపురనేని మధుసూదనరావు అన్నారు. అదే భావాన్ని తన రచనల ద్వారా తిర్మల్ విస్తృతంగా చాటారు.
విరసం ఉద్యమం ద్వారా తిర్మల్ తన సాహిత్యయాత్రలో మరింత తీవ్రతను సంతరించుకున్నారు. మాచర్లలో జరిగిన విరసం మహాసభల ప్రభావంతో ఆయన 1980ల్లో ఖమ్మం విరసం యూనిట్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో విరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులై ఉద్యమ సాహిత్యాన్ని ఒక కొత్త ధోరణిలో వ్యాప్తి చేశారు. ‘ఉద్యమగానం’ పేరిట విడుదలైన ఉద్యమ పాటల సంకలనం ఖమ్మం ప్రజలలో నూతన చైతన్యాన్ని రేకెత్తించింది.
* ‘ప్రజా రచయితల సంఘం’ ఆవిర్భవంలో కీలక పాత్ర.
1985లో విరసం నుంచి విడిపోయిన సమయంలో తిర్మల్ మరో కీలక మలుపు తిప్పారు. విరసం వ్యవస్థలో తలెత్తిన సిద్ధాంత భేదాలు, ప్రజా సాహిత్యానికి అవసరమైన కొత్త వేదికల తపనతో, ఆయన ‘ప్రజా రచయితల సంఘం’ ఆవిర్భవంలో కీలకంగా వ్యవహరించారు. ఇది కేవలం సంఘంగా కాకుండా, ప్రజల వేదికగా మారి, అనేక సామాజిక అంశాలను కలం ద్వారా ఉద్యమించిన వేదికగా నిలిచింది.
* జర్నలిస్టుగా – ప్రజల సమస్యలపై నిర్భయ స్వరం.
తిర్మల్ కేవలం కవి గానే కాక, జర్నలిస్టుగా కూడా ప్రజల హక్కుల కోసం శబ్దమిచ్చిన సాహసి. ఆయన రాసిన అనేక విశ్లేషణాత్మక వ్యాసాలు, కాలమ్స్ శబ్దజాలంలో కాకుండా, నిశ్చల నిజాలను చెప్పిన ధైర్యపు రచనలు. ఖమ్మం జిల్లాలో జరిగిన అనేక ఉద్యమాలకు ఆయన తన కలంతో బలాన్నిచ్చారు. బహుళ రంగాలలో రచనలు చేసినప్పటికీ, ప్రజల వాదనకు అక్షరాలు అంకితమిచ్చిన తాత్త్వికంగా నిలిచిన కర్తగా గుర్తింపు పొందారు.
* విప్లవోద్యమాన్ని ముంచిన మేటి రచయితల స్ఫూర్తి.
తిర్మల్ సాహిత్యంపై వరవరరావు, త్రిపురనేని మధుసూదనరావు, హెచ్చార్కే, నమ్ము వంటి విప్లవ రచయితల ప్రభావం అసాధారణంగా కనిపిస్తుంది. వీరి రచనలతో పరిచయం, చర్చలు, కార్యాచరణలు తిర్మల్ రచనలపై స్థిరమైన ఆలోచనా శైలిని ముద్రించాయి. అంతేకాక, ఆయన రచనలు కూడా తరువాతి తరాలకు మార్గదర్శకంగా మారాయి.
* ఉద్యమ కవిత్వానికి నూతన దిక్సూచి.
తిర్మల్ కవిత్వం సామాన్యులకు అర్థమయ్యే భాషలో ఉండే ప్రత్యేకతను కలిగి ఉంది. “నిన్న మన బతుకు వెతలే నేటి నా పద్యంలో వస్తాయి” అనే ధృక్పథంతో తిర్మల్ రచించిన ప్రతి పద్యం ప్రజల జీవన అనుభవాలను ప్రతిబింబిస్తుంది. ఉద్యమ గీతాల రూపంలో, సభల వేదికలపై, గ్రామ గీతాల రూపంలో ఆయన పదాలు ప్రజల గుండెల్లో నాటుకుపోయాయి.
తెలుగు సాహిత్యంలో తిర్మల్ నాలుగు దశాబ్దాల కృషి ఒక ఉద్యమ చరిత్ర. ఇది కేవలం కవిత్వం గాని, జర్నలిజం గాని కాదు – ఒక మార్గదర్శి తాత్త్విక బలంగా నిలిచిన వ్యక్తిత్వం. విప్లవోన్ముఖ కవిత్వాన్ని, ప్రజాధారిత రచనలను, ఉద్యమ మౌలికతను కలగలిపిన కర్తగా తిర్మల్ తెలుగు భాషకు అశేష సేవ చేశారు. ఖమ్మం జిల్లాలోని ప్రజల మాటలు ఆయన పాటలైనప్పుడు, ఉద్యమాలుగా మారి, చరిత్రను తీర్చిదిద్దాయి. ఇటువంటి కవులకు, రచయితలకు తెలుగు భాష ఋణపడి ఉంటుంది. సంపూర్ణ సాహిత్య కుమారుడిగా బహుముఖ కృషి: తెలంగాణా మలిదశ ఉద్యమంలో నిర్మల్ తెలంగాణా రచయితల వేదిక నుండి మరుగునపడ్డతెలంగాణా రచయితలు హీరా లాల్ మోరియా, చందాల కేశవదాసు లాంటి రచయితలభయోగ్రఫీని ప్రజలకు పరిచయం చేయడంతో పాటు,పోలవరం ముంపు కవులు యాత్ర లో క్రియాశీలక పాత్ర పోషించారు.లాంచీకవిసమ్మళనం కవులు కవితాఖండికలను”జలఖడ్గం”పేరుతో ఆవిష్కరణ చేశారు.తెలంగాణా లో కాకతీయుల గొలుసుకట్టు చెరువులు పై “మన ఊరు -మనచెరువు”పేరుతో పుస్తకం రాశారు.చురక-1,2 సంపుటాలు ద్వారా తన రాజకీయ, సామాజిక, సాహిత్య విశ్లేషణలు పరిచయం చేశారు.”ప్రజా సంస్కృతి”పేరుతో పత్రిక ను సైతం నాలుగేళ్ళ పాటు సంపాదక బాధ్యతలు నిర్వర్తించి నడిపారు.ఉభయతెలుగు రాష్ట్ర లలో ఉద్యమ సాహిత్య కుమారుడిగా తిర్మల్ లబ్ది ప్రతిష్ట డు.సాహిత్యరంగంలో ఆయన కలం నుంచి మరిన్ని రచనలు జాలువిరాలని ఆశిద్దాం.
గడల. నరసింహారావు. సీనియర్ జర్నలిస్ట్, ఖమ్మం








