మహా: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్ఘటించారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని గుర్తుచేశారు. ధాన్య ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంలో రైతులకు ఉపయోగపడేలా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ధరణి కొందరికి చుట్టమైతే.. భూభారతి ప్రజలకు రక్షణ చట్టమని మఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గన్‌పార్క్ వద్ద అమరవీరులకు సీఎం నివాళులర్పించారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ‘నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం.. విద్యార్థులు-యువకులు, ఉద్యోగులు-మహిళలు, మేధావులు, కవులు – కళాకారులు, సకలజనులు ఉద్యమించి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చుకున్న రోజు… ఇది మనందరం గర్వించదగిన రోజు. ఈ సందర్భంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.. ఈ రోజు రాష్ట్ర ప్రజల కలను నిజం చేసిన శ్రీమతి సోనియా గాంధీగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలంగాణ అమర వీరులకు ఘన నివాళులు అర్పిస్తున్నా. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం దశాబ్దాలుగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నం. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. అందుకే పదేళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. డిసెంబర్ 7, 2023న మేం బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రయత్నం మొదలు పెట్టాం. మేం బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. జరిగిన తప్పిదాలను సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇది నల్లేరుపై నడక కాదని మాకు తెలుసు. అయినా ప్రజల ఆకాంక్షలనే ప్రజా ప్రభుత్వ ఎజెండాగా తెలంగాణ పునర్నిర్మాణం దిశగా ప్రయత్నిస్తూ ముందుకు కదిలామని’ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
కమిషన్‌ను ప్రక్షాళన చేసి..
పాఠశాలల్లో మౌళిక సదుపాయాలను కల్పించే పనులను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించామని సీఎం తెలిపారు. ‘దేశంలో అదానీ, అంబానీలతో పోటీ పడేలా మహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయించాం. పెట్రోల్ బంకులు, పాఠశాలల నిర్వహణ, యూనిఫాంల కుట్టుపనితో పాటు మహిళా శక్తి క్యాంటీన్లను నిర్వహించేలా మహిళలను ప్రోత్సహిస్తున్నాం. తాము తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు అంతర్జాతీయ మార్కెట్లో మహిళా సంఘాలు పోటీ పడేలా హైటెక్ సిటీ పక్కన శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ఏర్పాటు చేశాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాదు, ఆ బస్సులకు వారిని యజమానులుగా మార్చే కార్యక్రమాలను చేపట్టాం. మహిళా సంఘాల ద్వారా 600 బస్సలు కొనుగోలు చేయించి.. ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే ఆలోచన చేశాం. ఇప్పటికే 150 బస్సులను వారికి అందజేసి రాష్ట్ర ఆర్థిక నిర్మాణంలో మహిళలను భాగస్వాములను చేస్తున్నాం. మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నాం. తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నాం. విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసుకున్నాం. సమాచార కమిషనర్లను, లోకాయుక్త, హెచ్ఆర్సీ సభ్యులను నియమించుకుని, వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నాం. తెలంగాణ సమాజానికి పునాది మహిళలే. అందుకే కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే ఉక్కు సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పాలసీని ఆవిష్కరించుకున్నాం. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తొలి ఏడాదిలోనే రూ.21వేల కోట్లు సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేశామని’ అన్నారు.
రూ.500 బోనస్ ఇస్తున్నాం..
రాష్ట్రంలో మహిళలు మహాలక్ష్మిలా మారి సగర్వంగా నిలబడాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. ‘రాష్ట్రానికి రైతే వెన్నెముక. అందుకే రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశాం. కేవలం ఎనిమిది నెలల్లో 25లక్షల, 35వేల,964 మంది రైతులకు రూ.20,617 కోట్లు రుణమాఫీ చేసి అన్నదాతల రుణం తీర్చుకున్నాం. రూ.15,333 కోట్లతో రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.12వేలకు పెంచాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంతో భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఏడాదికి రూ.12వేలు అందిస్తున్నాం. వరి ధాన్యానికి మద్ధతు ధరతో పాటు సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నాం. రిజర్వేషన్లు పెంచి బలహీన వర్గాల వారికి అండగా నిలవాలన్నదే ప్రజా ప్రభుత్వ విధానం. బీసీలకు స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగాల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకున్నాం. కులగణన ద్వారా దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపాం. శాస్త్రీయంగా కులగణన నిర్వహించింది. బీసీల లెక్క 50.36 శాతంగా తేల్చాం. దానికి అనుగుణంగా బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే నిర్ణయం తీసుకున్నాం. శాసనసభ, శాసన మండలిలో బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించుకున్నాం. పేదల ఆకలి తీర్చడమే కాదు, వారు ఆత్మగౌరవంతో జీవించేలా సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించాం. సంక్షేమ పథకాల చరిత్రలో సన్నబియ్యం ఒక ట్రెండ్ సెట్టర్. తెలంగాణలో మూడు కోట్ల మంది సన్నబియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.
తెలంగాణ పోలీస్ నెంబర్‌వన్..
ప్రపంచ దేశాల నగరాలకు ధీటుగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మూసీ నదికి పూర్వ వైభవం తెచ్చేందుకు మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును చేపడుతున్నాం. బాపూఘాట్‌ను అంతర్జాతీయ స్థాయిలో గాంధీ సరోవర్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నాం. ఏఐ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఫార్మా సిటీలతో పాటు లైఫ్ సైన్సెస్, హెల్త్ సిటీలను ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో మౌళిక సదుపాయాల్లో భాగంగా విమానాశ్రయాల సంఖ్యను పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణకు అన్ని అనుమతులు సాధించాం. హైదరాబాద్ నగర అభివృద్ధి లక్ష్యంగా దాదాపు రూ. 18వేల కోట్లతో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాం. రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్లు నిర్మించబోతున్నాం. రీజనల్ రైల్‌తో పాటు మెట్రో రైల్ విస్తరణ చేపడుతున్నాం. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రూ.24వే ల కోట్లతో మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రాజెక్టును చేపడుతున్నాం. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖను మరింత పటిష్టపరిచాం. డ్రగ్స్‌పై ఉక్కు పాదం మోపేందుకు చర్యలు తీసుకున్నాం. ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025 ప్రకారం దేశంలోనే తెలంగాణ పోలీస్ నెంబర్‌వన్‌గా నిలిచింది.
తెలంగాణ రైజింగ్-2047 భవిష్యత్..
మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అందించిన అలీన విధాన స్ఫూర్తితో ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై సమ్మిట్‌లో చర్చించాం. భారత్ సమ్మిట్ వేదికగా తెలంగాణ రైజింగ్‌ను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాం. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రపంచ సుందరి పోటీలకు ఆతిథ్యం కల్పించాం. తెలంగాణ జరూర్ ఆనా అంటూ వందకు పైగా దేశాల నుంచి 72వ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. వారంతా తెలంగాణ చారిత్రక కట్టడాలను, టూరిస్ట్ ప్రదేశాలను సందర్శించి తెలంగాణ చారిత్రక వైభవాన్ని ప్రపంచ నలుదిశలా చాటారు. 2047 నాటికి భారతదేశం వందేళ్ల స్వాతంత్య్ర వేడుకలకు సిద్ధమవుతుంది. దేశాన్ని 30 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడంలో తెలంగాణను అగ్రభాగాన నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్నాం. అందుకే తెలంగాణ రైజింగ్-2047 భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాం. వచ్చే పదేళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిద్దాలని నిర్ణయించాం. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా మార్చే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. తెలంగాణ రైజింగ్ మనల్ని నడిపించే మంత్రం. 2047నాటికి దేశంలోనే కాదు, ప్రపంచంలోనే తెలంగాణను నెంబర్ వన్‌గా నిలిపే దిశగా ప్రజా ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. పారదర్శక పరిపాలనతో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజా ప్రభుత్వానికి మీరంతా అండగా ఉంటారని ఆశిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.








