సంక్షేమ విద్యార్థులకు సర్కార్ వరదానం.
* ఇక ఏడాది పొడవునా స్కాలర్‌షిప్ దరఖాస్తులు.
* ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో నవశకం.
* నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకే నిధులు.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన శుభవార్త అందించింది. సంక్షేమ విద్యార్థుల ఉన్నత చదువులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు బోధన ఫీజులు (ఫీజు రీయింబర్స్‌మెంట్), ఉపకార వేతనాల (స్కాలర్‌షిప్) మంజూరు ప్రక్రియలో చారిత్రాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఇకపై ఫీజుల కోసం నిర్ణీత గడువుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా, ఏడాది పొడవునా దరఖాస్తు చేసుకునే సువర్ణావకాశాన్ని కల్పించింది. గతంలో ఫీజుల చెల్లింపుల కోసం అమలులో ఉన్న జీవో నం.7ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేసింది. దీని స్థానంలో మరింత పారదర్శకంగా, ఏకకాలంలో ఏడాది ఫీజు మొత్తం చెల్లించేలా నూతన నిబంధనలతో బోధన ఫీజుల నోడల్ విభాగమైన ఎస్సీ సంక్షేమశాఖ ద్వారా ‘జీవో నం.9’ను జారీ చేసింది. ఈ విప్లవాత్మక నిబంధనలు ఈ విద్యా సంవత్సరం (2026-27) నుంచే అమల్లోకి రానున్నాయి.
**ఫీజుల చెల్లింపుల క్యాలెండర్ ఖరారు**
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్థులందరూ ఎప్పుడైనా సరే తమ దరఖాస్తులను, రెన్యువల్స్ ను పోర్టల్ ద్వారా సమర్పించుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న సమయాన్ని బట్టే ఫీజుల మంజూరు ఆధారపడి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత క్రమంలో ముందుగానే నిధులు మంజూరవుతాయి. ఏప్రిల్ 1 నుంచి జులై 31 వరకు అందిన దరఖాస్తులను పరిశీలించి ఆగస్టు 15 నాటికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర వాటా ఆగస్టు 15న రాగా, కేంద్ర వాటా విడుదలైన వెంటనే జమ అవుతుంది. మిగిలిన వర్గాలకు ఆగస్టు 15న చెల్లిస్తారు. ఆగస్టు 1 నుంచి నవంబరు 30 వరకు దరఖాస్తు చేసుకుంటే డిసెంబరు 30 నాటికి, డిసెంబరు 1 నుంచి జనవరి 31 వరకు చేసుకుంటే ఫిబ్రవరి 28 నాటికి, ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకుంటే 75 రోజుల్లోగా ఫీజులు విడుదల చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
**ప్రత్యక్ష నగదు బదిలీ.. వారం రోజుల్లోనే కళాశాలలకు చెల్లింపు**
ఫీజుల చెల్లింపుల విధానంలో దళారీ వ్యవస్థకు, కళాశాలల ఆధిపత్యానికి ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇకపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు సంబంధించిన ఫీజు మొత్తాన్ని ‘ప్రత్యక్ష నగదు బదిలీ’ పద్ధతిలో నేరుగా విద్యార్థుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనున్నారు. ప్రభుత్వం నుంచి తమ బ్యాంకు ఖాతాల్లో ఫీజు నగదు జమ అయిన వారం రోజుల లోపు, ఆ మొత్తాన్ని విద్యార్థులు తాము చదువుతున్న విద్యాసంస్థలకు విధిగా చెల్లించాలి. ఒకవేళ నిర్ణీత గడువులోగా కళాశాలలకు ఫీజు చెల్లించకపోతే చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం ఆ మొత్తాన్ని సదరు విద్యార్థి నుంచి ప్రభుత్వం రికవరీ చేస్తుందని హెచ్చరించింది.
**పారదర్శకతకు పెద్దపీట.. సరికొత్త మార్గదర్శకాలు**
వ్యవస్థలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలను తీసుకువచ్చింది. 2026-27 విద్యా సంవత్సరంలో కొత్తగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ‘ఆటోమేటిక్ రెన్యువల్’ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. మొదటి సంవత్సరం దరఖాస్తు చేసుకుంటే చాలు, వచ్చే విద్యా సంవత్సరానికి అదే ఆటోమేటిక్ గా రెన్యువల్ అవుతుంది. రాష్ట్రంలో స్థానికంగా నివాసం ఉంటూ, కుటుంబ వార్షికాదాయం రూ. 2.5 లక్షల లోపు ఉన్న విద్యార్థులు మాత్రమే దీనికి అర్హులు. విద్యార్థులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం ఈ-పాస్ పోర్టల్ లో ఒక ప్రత్యేక ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నకిలీ సర్టిఫికెట్లతో అక్రమాలకు పాల్పడితే వారి నుంచి ఆ మొత్తాన్ని కఠినంగా వసూలు చేస్తారు. విద్యాసంస్థలు తప్పనిసరిగా ఆధార్ ఆధారిత హాజరు వ్యవస్థను అమలు చేయడంతో పాటు, ఆ వివరాలను ఈ-పాస్ పోర్టల్ కు అనుసంధానం చేయాలి. నిధులు పక్కదారి పట్టకుండా ప్రతి ఏటా బోధన ఫీజుల మంజూరుపై ‘సోషల్ ఆడిట్’ నిర్వహించడంతో పాటు, ఒక స్వతంత్ర ‘థర్డ్ పార్టీ’ సంస్థ ద్వారా క్షేత్రస్థాయిలో మదింపు చేయిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.








