Mahaa Daily Exclusive

  సి.ఎం.ఆర్. లక్ష్యాలను వీలైనంత తొందరగా పూర్తి చేయాలి –రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి డి.ఎస్.చౌహాన్..!

Share

మంచిర్యాల, మహా : రాష్ట్రంలోని జిల్లాల వారిగా కేటాయించిన సి. ఎం.ఆర్. లక్ష్యాలను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రధాన
కార్యదర్శి డి ఎస్ చౌహాన్ అధికారులకు సూచించారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సంచాలకులు ముజామిలాఖాన్,
ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో సి.ఎం.ఆర్. లక్ష్యాల సాధన, రేషన్ కార్డుల జారీ, వచ్చే సీజన్ ధాన్యం కొనుగోలుకు ముందస్తు సన్నాహాలకు సంబంధిత
అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఈ
సీజన్లో రికార్డు స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో వరిధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. లక్ష్యానికి మించి కొనుగోలు చేయడంతో బాధ్యత మనపై పెరిగిందని వెల్లడించారు.
ప్రజాపంపిణీ వ్యవస్థలో చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ కార్డుదారులకు నిర్ణీత సమయంలో జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన సన్నబియ్యంను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో 1 కోటి 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సి.ఎం.ఆర్. ప్రక్రియ పూర్తి చేయవలసి ఉందని అన్నారు. నెలకు కనీసం 9 లక్షల మెట్రిక్ టన్నులు డెలివరీ జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చిన రైస్ మిల్లులకు వరిధాన్యం కేటాయించాలని సూచించారు.
వచ్చే సీజన్ లో వరిధాన్యం కొనుగోలు చేసేందుకు ముందస్తు సన్నాహక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్యాడీ క్లీనర్లు, ప్యాడీ డ్రయ్యర్స్, టార్పాలిన్లు ఇతర అవసరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. రైస్ మిల్లర్లు తమ మిల్లుల సామర్థ్యాన్ని పెంపొందించుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. కొత్త రేషన్ కార్డుల కొరకు వచ్చిన దరఖాస్తులను సంపూర్ణంగా పరిశీలించి మంజూరు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.