రామమందిర విరాళాల కేసుపై సిట్‌కు ఆదేశాలు.
* ఫోరెన్సిక్ ఆడిటర్‌ను చేర్చాలని సుప్రీంకోర్టు స్పష్టం.
ఢిల్లీ, మహా.
అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఆరోపణలకు సంబంధించిన కేసు దర్యాప్తులో పారదర్శకత, నిష్పాక్షికత ఉండేలా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లో ఫోరెన్సిక్ ఆడిటర్‌ను తప్పనిసరిగా చేర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తు పురోగతిపై రెండు వారాల్లోగా సమగ్ర స్థితిగతుల నివేదిక (స్టేటస్ రిపోర్ట్) సమర్పించాలని సిట్‌కు గడువు విధించింది. విచారణను వేగవంతంగా, సమగ్రంగా పూర్తి చేయాలని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది.
కేసు విచారణ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఐజీ కిరణ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సుప్రీంకోర్టుకు తెలియజేశారు. కేసులోని అన్ని అంశాలను నిష్పాక్షికంగా పరిశీలించి, వాస్తవాలను వెలికితీసేలా దర్యాప్తు కొనసాగించాలని న్యాయస్థానం సూచించింది.
విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఆలయానికి వచ్చిన విరాళాల పూర్తి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించాలని కోర్టును కోరారు. అయితే ప్రస్తుతం తమ ప్రధాన దృష్టి దర్యాప్తును సమర్థవంతంగా పూర్తి చేయడంపైనే ఉందని ధర్మాసనం పేర్కొంది. ఈ దశలో విరాళాల వివరాలను బహిర్గతం చేయాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.
సిట్ సమర్పించే స్టేటస్ రిపోర్ట్‌ను పరిశీలించిన అనంతరమే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫోరెన్సిక్ ఆడిటర్‌ను దర్యాప్తు బృందంలో భాగస్వామ్యం చేయడం ద్వారా ఆర్థిక లావాదేవీలు, విరాళాల నిర్వహణకు సంబంధించిన అంశాలను సాంకేతికంగా పరిశీలించే అవకాశం ఉంటుందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.
సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఆరోపణల కేసు దర్యాప్తు మరింత వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. సిట్ సమర్పించే నివేదిక ఆధారంగా తదుపరి న్యాయపరమైన చర్యలు చేపట్టనున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.







