శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు
• పోలీసు బలప్రయోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.
ఢిల్లీ, మహా.
శాంతియుతంగా నిరసన తెలపడం ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిరసనల సందర్భంగా పోలీసులు అనవసరంగా బలప్రయోగానికి పాల్పడకూడదని, లాఠీఛార్జ్ వంటి చర్యలు అత్యవసర పరిస్థితుల్లోనే ఉండాలని పేర్కొంది. భారీ ఆందోళనల సమయంలో దేశవ్యాప్తంగా పోలీసులు అనుసరించాల్సిన ఒకే విధమైన ప్రామాణిక మార్గదర్శకాలు (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్) రూపొందించే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం పలు పిటిషన్లను విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. అనుమతి పొందిన ప్రదేశాల్లో ప్రజలు శాంతియుతంగా తమ నిరసనను వ్యక్తం చేసే హక్కును ఎవరూ హరించలేరని స్పష్టం చేసింది. అయితే ఆందోళనల పేరుతో హింసకు పాల్పడే సంఘ విద్రోహులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవచ్చని తెలిపింది.
నిరసనల్లో గాయపడిన ఆందోళనకారుల భద్రత ఎంత ముఖ్యమో, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది రక్షణ కూడా అంతే ప్రాధాన్యమని ధర్మాసనం పేర్కొంది. ప్రజలు, పోలీసులు ఇద్దరూ స్వీయ క్రమశిక్షణ పాటించినప్పుడే ప్రజాస్వామ్య విలువలు బలోపేతం అవుతాయని వ్యాఖ్యానించింది. విధుల్లో పాల్గొనే పోలీసులకు హెల్మెట్లు, రక్షణ పరికరాలు, ఇతర భద్రతా సామగ్రి తగినంతగా అందుబాటులో ఉంచుతున్నారా లేదా అనే విషయంపై కూడా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివరణ కోరే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది.
నిరసనల సమయంలో పోలీసులు అనుసరించాల్సిన విధివిధానాలపై దేశవ్యాప్తంగా ఒకే విధమైన ప్రామాణిక నిబంధనలు అవసరమని పలువురు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురాగా, దీనిపై ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. పోలీసుల అధిక బలప్రయోగం జరిగితే స్వతంత్ర సంస్థతో నిష్పాక్షిక విచారణ జరగాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడింది.
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల సందర్భంగా ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్‌లో పోలీసులు బలప్రయోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు, బిహార్‌లోని సివాన్‌లో పోలీసుల కాల్పుల ఘటనలపై దాఖలైన పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు విచారించింది. మరోవైపు నిరసనకారుల దాడుల్లో గాయపడిన పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల తరఫున దాఖలైన పిటిషన్లను కూడా ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.
ఈ అంశాలు ఒకే రాష్ట్రానికి పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకున్నవని సుప్రీంకోర్టు పేర్కొంది. పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లను ఈ నెల 28న సమగ్రంగా విచారించాలని ఆదేశించింది. నిరసనకారులపై పోలీసులు అధిక బలప్రయోగం చేశారా, ఆందోళనల్లో హింసకు అసలు కారకులెవరు, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై తీసుకున్న చర్యలు సరైనవేనా అనే అంశాలపై నిష్పాక్షికంగా పరిశీలన జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది.







