ఆదిలాబాద్, మహా
మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు చేయాలని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం( సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల చిన్నన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం చిన్నన్న మాట్లాడుతూ కార్మికులకు రావాల్సిన భోజన బిల్లులు నెలల తరబడి పెండింగ్ లో ఉండటం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కార్మికులకు రూ. 10వేతనం అమలు చేయాలని స్పష్టం చేశారు. కోడిగుడ్లకు అదనంగా చెల్లించాలని లేనిపక్షం లో అంగన్వాడీ ల మాదిరి సరఫరా చేయాలని తెలిపారు.గ్యాస్ కు సబ్సిడీ ఇవ్వాలని, గుర్తింపు కార్డులు జారీ చేయాలని వివరించారు.మధ్యాహ్న భోజనం నిర్వహణను స్వచ్చంద సంస్థలకు ఇవ్వకూడదని తెలిపారు. ఈ కార్యక్రమం లో కార్మికులు లక్ష్మి, సక్కుబాయి, ఇర్ఫాన, రజియా, భూదేవి తదితరులు పాల్గొన్నారు.







