ఆదిలాబాద్, మహా
గిరిజన, మైదాన ప్రాంతాల్లో యాభై ఏండ్లుగా నివాసం ఉంటున్న లంబాడీలకు ఎస్టీ కుల దృవీకరణ పత్రాలు జారీ చేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చౌహన్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. విద్యార్థులు, రైతులు, మహిళలతో కలిసి నిరసన చేపట్టి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా భరత్ చౌహాన్ మాట్లాడుతూ యాభై ఏండ్లకు పైగా నివాసం ఉంటున్న తమకు కుల ధృవీకరణ పత్రం ఇవ్వకపోవడం దారుణమని తెలిపారు. దీని వల్ల తమ పిల్లల భవిత ప్రశ్నార్ధకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నవోదయ, సైనిక్ స్కూల్ లలో సీట్లు వచ్చినప్పటికీ కుల సర్టిఫికేట్ లేని కారణంగా వెళ్ళలేని పరిస్థితి నెలకొందన్నారు. తమ ఇబ్బందులను గుర్తించి కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాదవ్ కృష్ణ నాయక్, మధుకర్, పరశురాం, చంద్రకాంత్ నాయక్, గంగారాం తదితరులు పాల్గొన్నారు.








