Mahaa Daily Exclusive

  చారాణా కోడికి బారాణా మసాలా.. రేవంత్ సర్కారుపై కేటీఆర్ విమర్శలు..

Share

తెలంగాణ ప్రభుత్వం మొదటి విడతగా గురువారం రూ. లక్ష రైతు రుణమాఫీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతులతో కలిసి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరిపారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రేవంత్ రెడ్డి సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఊరించి ఏడు నెలలు ఏమార్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ తీరు చూస్తే ‘చారాణా కోడికి బారాణా మసాలా’ అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు.

 

రుణమాఫీ ప్రక్రియపై ‘ఎక్స్'(ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్పార్టీపై ఘాటుగా స్పందించారు కేటీఆర్. రుణమాఫీ అయిన రైతులకన్నా కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు రైతుమాఫీ పథకానికి మరణ శాసనాలు అయ్యాయని కేటీఆర్ఆరోపించారు.

 

అన్నివిధాలా అర్హత ఉన్నా ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పేవారు లేరని, రైతన్నలు తమ గోడు చెప్పుకుందామంటే వినేవారు లేరని కేటీఆర్ అన్నారు. అర్హులైన లబ్దిదారులు రుణమాఫీ కాక అంతులేని ఆందోళనలో ఉంటే ఎందుకీ సంబరాలని ప్రశ్నించారు. నలభై లక్షల మందిలో మెజారిటీ రైతులకు నిరాశే మిగిల్చినందుకా? ముప్ఫై లక్షల మందిని మోసం చేసినందుకా? అని కేటీఆర్ రేవంత్ సర్కారును నిలదీశారు.

 

మరోవైపు, రెండు సీజన్లు అయినా రైతుభరోసా ఇంకా ప్రారంభించలేదని, జూన్‌లో వేయాల్సిన రైతుభరోసా నిధులను జులై వచ్చినా రైతుల ఖాతాలో వెయ్యలేదని కేటీఆర్ మండిపడ్డారు. కౌలు రైతులకు ఇస్తానన్న 15 వేల రూపాయలు కూడా ఇవ్వలేదని, రైతు కూలీలకు ఇచ్చిన 12 వేల రూపాయల హామీ ఇంకా అమలు చెయ్యలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మభ్యపెట్టే పాలన అంటూ విమర్శించారు. ఇంతకాలం అటెన్షన్ డైవర్షన్, ఇప్పుడేమో ఫండ్స్ డైవర్షన్ అని ఎద్దేవా చేశారు కేటీఆర్.

 

మరోవైపు, బీఆర్ఎస్సీనియర్నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కూడా కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ప్రభుత్వం 20 శాతమే రుణమాఫీ చేసి గొప్పలు చెబుతోందని దుయ్యబట్టారు. రేవంత్ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని మండిపడ్డారు. రైతు భరోసా ఇస్తామన్నారు ఏమయ్యిందంటూ? పల్లా రాజేశ్వర్ రెడ్డి నిలదీశారు. అయితే, బీఆర్ఎస్ నేతల విమర్శలపై కాంగ్రెస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.