మందమర్రి, మహా : నేటి దేశవ్యాప్తం సమ్మెకు సింగరేణి కాలరీస్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న అన్ని వర్గాల కార్మికులు, ఉద్యోగులు దూరంగా ఉండాలని ఆ సంస్థ డైరక్టర్ (పి,పి) కే వెంకటేశ్వర్లు, డైరక్టర్(పా) గౌతమ్ పొట్రు లు విన్నవించారు.
మంగళవారం అన్ని ఏరియాలో జిఎం లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని కార్మిక సంఘాలు కార్మిక సంఘాల జేఏసీగా ఏర్పడి వివిధ డిమాండ్లతో జూలై 9 నాడు ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. కాని ఈ సమ్మె డిమాండ్లలో అత్యధికం సింగరేణి కార్మికులకు సంబంధించినవి కావని చెప్పారు. ఇప్పటికే వివిధ కారణాల వలన ఈ ఆర్థిక సంవత్సరం లో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి, ఓవర్ బర్డెన్ తొలగింపు లలో కొంత వెనకబడి ఉన్నామని స్పష్టం చేశారు. మనం ఒక్కరోజు సమ్మె చేస్తే సంస్థ నష్ట పోయే ఉత్పత్తి విలువ సుమారు రూ.76 కోట్లు ఉండగా కార్మికులు సుమారు రూ.13.07 కోట్ల రూపాయల వేతనాలు కోల్పోతారని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం 2024-25లో 69.01 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 65.27 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా జరిగినదని తెలిపారు. అందులో నుండి లాభాల బోనస్, పిఎల్ఆర్ బోనస్లు ఉద్యోగులకు చెల్లించడమే కాకుండా వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు జులై 1 నుంచి 16.26 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించామని తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరం (2025-26) ఉత్పత్తి లక్ష్యమైన 72 మిలియన్ టన్నులకు జూలై 1 నాటికి కేవలం 22.4 శాతం మాత్రమే ఉత్పత్తి సాధించామని తెలిపారు. నేటి దేశవ్యాప్త సమ్మెకు దూరంగా ఉండి అన్ని వర్గాల కార్మికులు ఉద్యోగులు విధులకు హాజరు కావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కాన్ఫరెన్స్ లో మందమర్రి జిఎం దేవేందర్, శ్యాంసుందర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








