Mahaa Daily Exclusive

  ఎరువులు పక్కదారి.. -మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న అక్రమార్కులు -అధిక ధరలకు విక్రయిస్తూ..సొమ్ము చేసుకుంటున్న వైనం -స్థానికంగా కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు..!

Share

ఆదిలాబాద్, మహా

జిల్లాకు వచ్చిన ఎరువులు పక్కదారి పడుతున్నాయి. అక్రమ మార్గంలో మహారాష్ట్రకు తరలుతున్నాయి. ఫలితంగా జిల్లాలో ఎరువుల కొరత ఏర్పడుతోంది. పక్షం రోజుల వ్యవధిలోనే రెండు చోట్ల వాహనాలు పట్టుబడటం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది.
జిల్లాలో యూరియా, డీఏపీ వంటి ఎరువులు లభించక స్థానిక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. కొందరు వ్యాపారులు అక్రమంగా పొరుగు రాష్ట్రానికి తరలిస్తూ సొమ్ము చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. పోలీసు యంత్రాంగం అక్రమ రవాణా మార్గాలపై నిఘా కొనసాగిస్తున్నప్పటికీ వారి కళ్లు గప్పి ఎరువులు తరలించడం చర్చనీయాంశంగా మారుతోంది. ఇటీవల భీంపూర్ మండలంలోనూ ఓ ఎరువుల లారీ పట్టుబడగా.. తాజాగా బేల మండలంలో అక్రమంగా ఎరువులు తరలిస్తున్న వాహనాన్ని అధికారులు పట్టుకోవడం సంచలనంగా మారింది.

ఎరువులు దొరక్క ఇబ్బందులు..

ఆదిలాబాద్ జిల్లాకు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 17వేల మెట్రిక్ టన్నుల యూరియా, 13,500 మె.టన్నుల డీఏపీ, 15250 మె.టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరమని అధికారులు ప్రతిపాధనలు పంపించగా.. ప్రభుత్వం ఈ మేరకు సరఫరా చేసింది. తొలుత రైతులు సులువుగానే ఆయా ఎరువులు తీసుకెళ్లినప్పటికీ.. కొద్ది కాలానికి మళ్లీ అవసరం మేరకు దొరకడం లేదు. దీంతో రైతులు ఎరువులు దుకాణాలు, పీఏసీఎస్ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇటీవల తలమడుగు మండలం పల్లి బిలో రైతులు ఎరువుల కోసం చెప్పులు వరుసల్లో పెట్టి నిల్చున్న ఘటనలు చోటుచేసుకున్నాయి.

అధిక ధరలకు ఆశపడి..

ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం యూరియా బస్తా రూ.269కి లభిస్తే అదే బస్తా మహారాష్ట్రలో రూ.400వరకు పలుకుతోందని తెలుస్తోంది. మరోపక్క అక్కడి ప్రభుత్వం పంటలకు యూరియాను ఎరువుల రూపంలో కాకుండా లిక్విడ్ రూపంలో వేయాలని నిబంధనలు విధించింది. లిక్విడ్ రూపంలోనే పంపిణీ చేస్తోంది. దీంతో ఈ రకంగా పంటలకు ఎరువులు పట్టించడం ఇష్టం లేని అక్కడి రైతులు ఎరువులు రూపంలో వేసేందుకే మొగ్గచూపుతున్నారు. దీంతో ఆదిలాబాద్ జిల్లాకు పొరుగున ఉండే అక్కడి గ్రామాల రైతులు ఎక్కువగా ఇక్కడి యూరియా, డీఏపీ వంటి ఎరువులను తీసుకెళ్తున్నారు. అక్కడి కొందరు వ్యాపారులతో మద్య దళారులు ఒప్పందం చేసుకొని మాట్లాడి బస్తా రూ.400చొప్పున విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అధిక ధరలు రావడంలో కొందరు వ్యాపారులు వాహనాల ద్వారా అక్కడికి పంపిస్తున్నట్లు స్థానిక రైతులు చెబుతున్నారు. మన ప్రభుత్వం యూరియాను పీఏసీఎస్ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తుండగా.. మిగితా ఎరువులను ఫర్టిలైజర్ దుకాణాల ద్వారానూ విక్రయాలు చేస్తోంది. కొందరు వ్యాపారుల కాసుల కక్కుర్తి కారణంగా ఇక్కడి ఎరువులను పొరుగు రాష్ట్రానికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. పక్షం రోజుల క్రితం భీంపూర్ మండల కేంద్రంలో దాదాపు 200క్వింటాళ్లపైన ఎరువులను అధికారులు పట్టుకోగా.. తాజాగా బేల మండలంలో 150 బస్తాల ఎరువులను పట్టుకున్నారు. ఇలా రోజూ అక్రమ మార్గంలో అక్కడికి సరఫరా కావడం మూలంగా స్థానిక రైతులకు ఎరువులు లభించని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ఎరువులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు

Latest