భద్రాద్రి కొత్తగూడెం, మహా: రైతులకు ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ నాయకులు చర్చకు రమ్మంటే సీఎం రేవంత్ తోకముడిచి జారుకున్నట్లు తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం గాడిన పడే సమయంలోనే కాంగ్రెస్ చేతిలోకి వెళ్లిందని, దీంతో మళ్లీ మన అస్థిత్వం కోసం పోరాటాలు, ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జై తెలంగాణ అనని వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని, అవినీతి చక్రవర్తి- అసమర్థ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా? అని ఆమె ప్రశ్నించారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించిన జాగృతి సమావేశంలో ఆమె మాట్లాడారు. తొలుత సీఐటీయూ జిల్లా నాయకుడు, ఉద్యమ కెరటం జి.వీరన్న, వివిధ సంఘాల నాయకులకు జాగృతి కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఎన్నికల్లో మహిళలకు, దివ్యాంగులకు, యువతకు, విద్యార్ధులకు, వృద్ధులకు ఒకరేమిటీ అందరికీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పథకాల కంటే ఎక్కువే ఇస్తామని, అబద్దపు, మోసపు మాటలు మాట్లాడి హామీలు, గ్యారెంటీలు ఇచ్చి ఒక్కటీ కూడా సక్రమంగా అమలు చేయకుండా, దేవుళ్ల మీద ఒట్టు వేస్తూ సీఎం రేవంత్ రెడ్డి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు.
సెక్రటేరియట్ వాస్తు బాగలేదని..
మహిళలకు నెలకు రూ.2,500, దివ్యాంగులకు రూ.8 వేల పెన్షన్, ఇతర పింఛన్‌దారులకు రూ.4 వేలు ఇస్తానని, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం ద్వారా తులం బంగారం ఇస్తానని హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తూ యావత్తు తెలంగాణ సమాజాన్ని మోసం చేసిన మోసగాడు రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. అడగకుండానే రైతులకు రైతు బంధు, రైతు బీమా ఇచ్చిన కేసీఆర్, అడిగినా ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతూ, అబద్ధపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న సీఎంకు రానున్న రోజుల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ది చెబుతారన్నారు. బీఆర్ఎస్ పాలనలో రైతులకు వ్యవసాయం పండుగ అయితే, కాంగ్రెస్ ప్రభుత్వంలో దండగలా మారిందని ఆరోపించారు. సెక్రటేరియట్ వాస్తు బాగలేదని, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులతో, అధికారులతో సమావేశాలు పెడుతున్న సీఎంను తాను ఒకటే అడుగుతున్నానన్నారు. మహిళలకు ఇచ్చిన హమీలపై పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోనే చర్చ పెడుదామని, నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేస్తే చర్చకు సిద్దపడాలని ఆమె సవాల్ విసిరారు. ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీతో సమావేశాలు పెట్టి హామీలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని, లేకుంటే ప్రజలే ఈ ప్రభుత్వ భరతం పడతారని హెచ్చరించారు.








