ఖమ్మం, మహా.
తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చిన నేపథ్యంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ ప్రాంగణం ఉత్సాహవంతంగా మారింది. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ జిల్లా ఓబీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం ఆధ్వర్యంలో స్వీట్లు పంచి, పూలతో అలంకరించి, నాయకుల జోష్‌తో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ ఏఐసీసీ కార్యదర్శి, సీడబ్ల్యూసీ శాశ్వత సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు శ్రీ చల్లా వంశీచంద్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ నాయకత్వంతో నేతలు మాట్లాడుతూ “దేశ చరిత్రలో ఇది ఒక కీలకమైన మలుపు. బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తూ 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం బీసీ సంక్షేమం పట్ల ఎంత నిబద్ధత కలిగి ఉందో ఇది సాక్ష్యంగా నిలుస్తోంది. మీసేవ పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతూనే ఉంది,” అన్నారు.
వారు ఇంకా చెప్పిన ప్రకారం “ఇది ఒక రాజకీయ నిర్ణయం కాదు, న్యాయబద్ధమైన సాంఘిక న్యాయం. స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రాతినిధ్యం పెంపు ద్వారా గ్రామీణ అభివృద్ధిలో వారు కీలక పాత్ర పోషించగలుగుతారు. ఇది అట్టడుగు వర్గాలకు ఆత్మగౌరవం కల్పించే తీర్మానం.”
ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహ్మద్ జావేద్, మాజీ శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వరరావు, రాష్ట్ర ఓబీసీ సెల్ నాయకురాలు హారికా నాయుడు, ఆర్టీఏ మెంబర్ గజ్జెల్లి వెంకన్న, ఐఎన్‌టియూసీ అధ్యక్షుడు కొత్తా సీతారాములు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొడ్డు బొందయ్య, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గౌస్, నగర ఓబీసీ సెల్ అధ్యక్షుడు బాణాల లక్ష్మణ్, జిల్లా ఓబీసీ సెల్ నాయకులు బమ్మిడి శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్లు రాపర్తి శరత్, అంజనీ కుమార్, బోయిన వేణు, తదితరులు పాల్గొన్నారు








