సత్తుపల్లి, జూలై 11: మహా.
తొలకరి చినుకులు పడుతున్న వేళ రైతులు వ్యవసాయానికి సన్నాహాలు ప్రారంభించారు. ఇప్పుడు పంట పొలాల జవసత్వాలకు సహకరించే ఎరువుల ప్రాముఖ్యత అధికం. ఇటువంటి సమయంలో రైతులను ఆందోళనకు గురిచేసి కృత్రిమ కొరత సృష్టించి ఎరువులను అక్రమ మార్గంలో విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారి వై.శ్రీనివాసరావు డీలర్లను హెచ్చరించారు. సత్తుపల్లి పట్టణంలో శుక్రవారం ఆయిల్ ఫామ్ రైతు సంఘం నాయకులు మల్లారెడ్డి పూర్ణచంద్రారెడ్డి ఆయిల్ ఫామ్ మొక్కల పంటకు తగిన ఎరువులు కొనుగోలు చేయడానికి ఎరువుల దుకాణాన్ని సంప్రదించగా దుకాణ డీలర్ ఎరువు కొరత ఉన్నదని తెలపడంతో ఆందోళన చెందిన రైతు మండల వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేశారు. స్పందించిన వ్యవసాయ అధికారి హుటాహుటిన ఎరువు గోడౌన్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎటువంటి ఎరువుల కొరత లేదని సుమారుగా యూరియా 170 టన్నులు, పొటాష్ (ఎం.ఓ.పి)130 టన్నులు, డి.ఏ.పి, ఇతర మిశ్రమ ఎరువులు 500 టన్నుల నిలువలు ఉన్నాయని తెలిపారు. రైతులకు ఎరువు కొరత ఉందని డీలర్లు తప్పుడు సమాచారం ఇస్తే కింది ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని కోరారు.
* మండల వ్యవసాయ అధికారి – 8977748723
* వ్యవసాయ విస్తరణ అధికారి –9281036987
* వ్యవసాయ విస్తరణ అధికారి– 9281036988








