ఆదిలాబాద్, మహా
ఆదిలాబాద్ జిల్లా వాసులు ఏళ్ళుగా ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ డిమాండ్ చేశారు. లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్రలో భాగంగా చేపట్టిన పర్యటనలో అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని వాటికి పరిష్కారం చూపాలని అన్నారు. డిమాండ్ల సాధనే లక్ష్యంగా మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ సందర్భంగా విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ద్వార అనేక సమస్యలు తెలుసుకున్నామని అన్నారు. ముఖ్యంగా పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపాలని, అదేవిధంగా ఏళ్ళుగా స్థానికులు పడుతున్న ఇక్కట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రజల పక్షాన జేఏసి తరపున నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు. ధర్నాలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు అగ్గిమళ్ళ గణేష్, నేతలు గణేష్, నరేష్, సుష్మ, శ్యామల, మంజూష, సంతోష్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.








