Mahaa Daily Exclusive

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు “నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డ్”ఈ నెల 17న ఐఐటీ బాంబేలో అవార్డు అందుకోనున్న జితేష్ వి. పాటిల్..!

Share

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 15 (మహా): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగానికి ప్రతినిధిగా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కు నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డు’ లభించింది. ఈ అవార్డు జూలై 17, ఐఐటీ బాంబేలో జరుగనున్న ‘ఓపెన్ సోర్స్ జిఐఎస్ డే’ లో ‘ఇస్రో’ మాజీ చైర్మన్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా ప్రదానం చేయబడనుంది.

భారతదేశంలో జిల్లా స్థాయిలో మొట్టమొదటిగా ‘ఓపెన్ సోర్స్ జిఐఎస్ కోహార్ట్’ ఏర్పాటు చేసి, గ్రామీణ సమస్యల పరిష్కారానికి జియోస్పేషియల్ టెక్నాలజీని ప్రాక్టికల్‌గా వినియోగించడంలో కలెక్టర్ విశిష్టమైన కృషి చేశారు. గోదావరి వరదలపై ఫ్లడ్ ప్రిడిక్షన్ అనాలిసిస్ కోసం జిఐఎస్ ఆధారంగా పరిష్కారాలను అమలు చేయడానికి తొలిసారిగా ప్రయత్నాలు చేయడం, గ్రామీణ స్థాయిలో జిఐఎస్ స్కిల్లింగ్, సామర్థ్య నిర్మాణంలో ఉన్నత నమూన రూపొందించడం వలన కలెక్టర్ కు ఈ అవార్డు లభించింది.

ఈ ప్రాజెక్టులో తొలి అడుగుగా, జిల్లా కలెక్టర్ చొరవతో ఐఐటి బాంబే ఫోస్సీ జిఐఎస్ మరియు దాని భాగస్వామి హెచ్ పీ హెచ్ ఎఫ్ తో కలిసి భారతదేశపు మొట్టమొదటి “ఓపెన్ సోర్స్ జిఐఎస్ కోహార్ట్” ను మే 6, 7 తేదీలలో అనుబోస్ ఇంజనీరింగ్ కాలేజీ, కొత్తగూడెంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అగ్రికల్చర్, మైనింగ్, ఇంజనీరింగ్ విద్యార్థులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. క్యూజిఐఎస్ ద్వారా గ్రామీణ సమస్యల పరిష్కారానికి జియోస్పేషియల్ డేటా వినియోగం ఎలా చేయాలో ప్రాక్టికల్‌గా నేర్పించారు.

ఉదాహరణకు, గోదావరి వరదల సమయంలో నీటి స్థాయిని బట్టి ముంపు గ్రామాలను ముందుగానే గుర్తించి హెచ్చరికలు జారీ చేయడo, వివిధ పిహెచ్సి మరియు సబ్ సెంటర్ పరిధిలో గల గవర్నమెంట్ స్కూల్స్ నీ జిఐఎస్ ద్వారా మ్యాప్ చేసి, పి హెచ్ సి పరిధిలో విద్యార్ధులు ఆరోగ్యం పట్ల డాక్టర్లను అప్రమత్తం చేయటం. ఈ విధంగా , వివిధ శాఖల సమాచారాన్ని, భౌగోళిక సమాచారంతో కలిపి అనాలసిస్ చేసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేలా జిఐఎస్ ఉపయోపడుతుంది.

భౌగోళిక డేటా ఆధారంగా క్షేత్రస్థాయి సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలు కనుగొనడం వంటి అంశాలపై ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం అభివృద్ధి దశలో కొనసాగుతోంది. ఇటువంటి జిఐఎస్ సాఫ్ట్వేర్ అందరికీ అందుబాటులో, గ్రామీణ ప్రాంతాలకు కూడా అందించటం ముఖ్యమైన మైలురాయిగా పేర్కొనవచ్చు.

తదుపరి దశలో ప్రతిభావంతమైన విద్యార్థులను ఎంపిక చేసి, ఐఐటీ బాంబే, ఫోస్సీ జిఐఎస్ సహకారంతో ఓపెన్ సోర్స్ జిఐఎస్ ఉపయోగించి, గ్రామీణ సమస్యల పరిష్కారానికి భౌగోళిక సమాచారమును ఏ విధముగా ఉపయోగించాలో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు రూపంలో నేర్పించడానికి ప్రణాళికలు రూపొందించబడ్డాయి.

ఇలా మన జిల్లా అభివృద్ధి పథంలో ముందు ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ఈ ప్రయత్నంలో కృషి పడిన హెచ్ పీ హెచ్ ఎఫ్ బృందానికి, ఆస్పిరేషన్ బ్లాక్ ఫెలో నవనీత్ కి అభినందనలు తెలిపారు. ఈ అవార్డు రావడం జిల్లా వాసులందరికీ గర్వకారణం అని వెల్లడించారు.

ఈ అవార్డును ఫోస్సీ (జిఐఎస్), ఐఐటీ బాంబే, విద్యాశాఖ, భారత ప్రభుత్వం (ఎన్.ఎం.ఇ.ఐ.సి.టి) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నేషనల్ జియోస్పేషియల్ అవార్డ్స్ 2025 (ఎడిషన్ 02)’ కింద ప్రదానం చేయనున్నారు. జియోస్పేషియల్ టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించడానికి, ‘నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022’ మరియు ‘ఇండియన్ స్పేస్ పాలసీ 2023’ కు అనుగుణంగా ఈ అవార్డులు అందించబడుతున్నాయి.

భారత ప్రభుత్వం 2022 డిసెంబరు 28న జాతీయ జియోస్పేషియల్ పాలసీ 2022 ను ప్రవేశపెట్టింది. దీని ముఖ్య ఉద్దేశ్యం సామాన్య ప్రజలకు జియోస్పేషియల్ సమాచారం అందుబాటులోకి తీసుకువచ్చి, ఆ ఆధారంగా ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ, క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించుకునే అవకాశాలను కల్పిస్తూ, జాతీయ అభివృద్ధి మరియు ఆర్థిక శ్రేయస్సుకు బలమైన జియోస్పేషియల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం.
ఈ విధంగా జియోస్పేషియల్ టెక్నాలజీని సమర్థంగా వినియోగిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే విధంగా పనిచేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగాన్ని గుర్తించి జిల్లా కలెక్టర్ కు ఈ అవార్డు లభించడం, జిల్లాకు గర్వకారణం.

Latest