ఆదిలాబాద్, మహా
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం.. వారి సంక్షేమమే ధ్యేయంగా ఎస్టియు పనిచేస్తుందని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బెజ్జంకి రవీంద్ర తెలిపారు.
అదిలాబాద్ పట్టణంలో ఎస్టియు సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గజిటెడ్ నెంబర్ 2 పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉపాధ్యాయులు కలిగి ఉన్న అన్ని రకాల సౌకర్యాలు, ఉద్యమాల ఫలితంగానే సాధ్యమైందని, సమస్యలపై ఎప్పటికప్పుడు ఎస్టీయూ రాజీలేని పోరాటాలు చేస్తుందని పేర్కొన్నారు. నాణ్యమైన పీఆర్సీ, సకాలంలో డిఏలు, పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ పదోన్నతులతో పాటు బదిలీలు చేపట్టే సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పారు. ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసు నిబంధనలు రూపొందించి, ఖాళీగా ఉన్న ఎంఈవో, డిప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్ పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో తొమ్మిది ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయ పోస్టుల మంజూరుకై తమ సంఘం కృషి చేస్తుందన్నారు. కెజిబివి పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టో హామీ మేరకు సిపిఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బత్తూరి సత్యనారాయణ, ఆదిలాబాద్ అర్బన్ మండలం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు ఎస్.చంద్రశేఖర్, బి.పోచారెడ్డి, తదితరులు పాల్గొన్నారు








