Mahaa Daily Exclusive

  జ్వాలాతో విద్యార్థినుల్లో ఆత్మస్థైర్యం -జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్..!

Share

ఆదిలాబాద్, మహా
విద్యార్థినులకు స్వీయ రక్షణ ఎంతగానో ముఖ్యమైనదని ఆపద సమయంలో ఆదుకునేలా పోలీసు యంత్రాంగం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లాలోని విద్యా సంస్థల్లో జ్వాలా పేరిట కరాటే శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే రెసిడెన్సియల్ పాఠశాలలో ఆపరేషన్ జ్వాలా పేరిట ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు, ప్రభుత్వ, ప్రైవేటు కరాటే అధ్యాపకుల సహకారంతో శిక్షణ అందిస్తామని తెలిపారు. విద్యార్థుల్లో చిన్నతనం నుంచి ఆత్మస్థైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణతో స్వీయ రక్షణతో తమను తాము రక్షించుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. మహిళలకు షీటీం లు అందుబాటులో ఉంటాయని, ఆపద సమయంలో డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఏస్పీ కాజల్ సింగ్, విద్యాశాఖాధికారి రవీందర్ రెడ్డి, డీఏస్పీ ఎల్. జీవన్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ పాల్గొన్నారు.