ఖమ్మం, మహా.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హిట్టయిన ఫ్లెక్సీ రాజకీయానికి వేదికగా ఖమ్మం మారింది. ఖమ్మం బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పాల్గొన్న వేళ, సభా ప్రాంగణంలో ఒక ప్రత్యేక ఫ్లెక్సీ ఆసక్తికరంగా మారింది. ‘‘లోడింగ్ 3.0’’ అంటూ ముద్రించిన ఆ ఫ్లెక్సీలో తలపాగా కట్టిన కేటీఆర్ ఫొటో, పక్కనే ‘‘2028లో రప్పా రప్పా… కాంగ్రెస్ నాయకులకు వడ్డీతో సహా చెల్లిస్తాం’’ అనే వ్యంగ్య వ్యాఖ్య హాజరైనవారిని కాసేపు ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఫ్లెక్సీకి సంబంధించి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
ఫ్లెక్సీ ద్వారా రాజకీయ సందేశం
సాధారణంగా నాయకుల ఫొటోలను మాత్రమే ప్రదర్శించే ఫ్లెక్సీలకు భిన్నంగా, ఈసారి కేటీఆర్‌ను హీరోలా చూపిస్తూ, తమలో ఎనర్జీ నింపేలా “లోడింగ్ 3.0” అని హైప్తో రూపొందించిన పోస్టర్ ద్వారా బీఆర్ఎస్ కార్యకర్తలు తమ ఆశలు, లక్ష్యాలను చాటారు. ఫ్లెక్సీలో తలపాగా కట్టిన కేటీఆర్ చిత్రాన్ని పెట్టి, దానికి రాజకీయ కసితో కూడిన వాఖ్యాన్ని జోడించడం రాజకీయ విశ్లేషకుల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. “వడ్డీతో సహా చెల్లిస్తాం” అన్న మాట ద్వారా కాంగ్రెస్ నాయకులకు గట్టి హెచ్చరిక పంపించారని బీఆర్ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఈ సందర్భంగా కేటీఆర్ కార్యకర్తలకు ఉత్సాహాన్నిచ్చేలా ప్రసంగించారు. “ఇప్పుడే ఎన్నికలు జరిపినా బీఆర్ఎస్ శతమానం భవతి, వంద సీట్లు గెలుస్తాం” అని ధీమాగా ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తే లేదని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి ఖాతా తెరవకుండా మూసివేస్తామని జోస్యం చెప్పారు.
అంతేకాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “అంబేద్కర్ గారు ప్రజాస్వామ్యం అంటే ఏమిటో ఊహించగలిగారు కానీ, దుర్మార్గులు అధికారంలోకి వస్తారని ఆయన ఊహించలేకపోయారు” అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. “ప్రతి రంగాన్ని మోసం చేస్తోంది కాంగ్రెస్. రైతన్నను, విద్యార్థిని, ఉపాధ్యాయుడిని, ఔషధాన్ని, ఉద్యోగాన్ని – అన్నింటినీ మోసం చేస్తున్నది ఈ పార్టీ” అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు.
సోషల్ మీడియాలో వైరల్
ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ముఖ్యంగా “3.0 లోడింగ్” ఫ్లెక్సీకి నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. “బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం” అనే నమ్మకంతో కార్యకర్తలు అంతులేని ఉత్సాహాన్ని చూపిస్తుండగా, ఈ ఫ్లెక్సీ ద్వారా ఆ భావోద్వేగానికి ప్రతిరూపంగా నిలిచింది.
ఖమ్మం నుంచి ఎన్నికల సెగ మొదలైందా?
ఈ సమావేశం ద్వారా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తిరిగి పుంజుకోవాలని చూస్తోందన్న సంకేతాలు స్పష్టంగా వెలుగులోకి వస్తున్నాయి. స్థానిక నేతలు, కార్యకర్తల సమన్వయంతో శక్తిని ప్రదర్శించే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోందని రాజకీయ వర్గాల అభిప్రాయం. అయితే ఈ వేడి రాజకీయ విమర్శలతో పాటు విభిన్నమైన ప్రచార యుధ్ధానికి శ్రీకారం చుట్టినట్టు “లోడింగ్ 3.0” ఫ్లెక్సీ ప్రదర్శన చెబుతోంది.








