పెనుబల్లి, మహా.
పెనుబల్లి మండలం పార్థసారథిపురం గ్రామ శివారులో ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన రైతు మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషాదం బయటపడింది.
పోలీసుల అందించిన వివరాల ప్రకారం…
స్థానిక పార్థసారధిపురానికి చెందిన వీరస్వామి అనే రైతు తన పోడు భూమిలో పొగాకు సాగు చేస్తూ జీవనోపాధిని సాగిస్తున్నాడు. కానీ గత ఏడాది పొగాకు పంట తీవ్రంగా నష్టాలు ఇవ్వడంతో అతడు అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. అప్పుల ఒత్తిడి మానసికంగా అతడిని అల్లాడించింది. దీంతో ఇంట్లో భార్యభర్తల మధ్య తరచూ వివాదాలు జరుగుతుండటంతో కుటుంబ వాతావరణం దిగజారింది.
ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం “పొలానికి వెళ్తున్నాను” అంటూ బయటికి వెళ్లిన వీరస్వామి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించగా ఆచూకీ దొరకలేదు.
శుక్రవారం ఉదయం గ్రామ శివారులోని అటవీ ప్రాంతానికి తోటకూలీలు వెళ్లిన సందర్భంగా చెట్టు కొమ్మకు ఉరివేసుకొని కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న పెనుబల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వ్యవసాయ మాఫియా వత్తిడి మరో ప్రాణం తీసింది
వీరస్వామి మృతి వ్యవసాయంలో నష్టాలే కాకుండా అప్పుల ఒత్తిడికి కచ్చితమైన నిదర్శనంగా గ్రామంలో చర్చనీయాంశమైంది. పొగాకు సాగుకు ప్రోత్సాహాలు ఇచ్చి, అనంతరం ధరల పతనంతో రైతులను నష్టాల బారిన పడేసిన విధానాలపై ప్రశ్నలు తిరుగుతున్నాయి. వ్యవసాయ విధానాల లోపాలు, మద్దతు లేకపోవడం వల్లే రైతు ఈ దుస్థితికి చేరుకున్నాడని గ్రామస్థులు వాపోతున్నారు.








