కారేపల్లి, మహా: కారేపల్లి మండలం మాణిక్యారరాఎర్రబోడు ఊటవాగు ప్లాంటేషన్ పోడు వివాదంలో ఫారెస్టు అధికారులు పేదలపై దాడులు చేయటమే కాక అక్రమంగా కేసులు బనాయించారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆక్షేపించింది. దీనికి సంబంధించి శుక్రవారం ఫారెస్టు డివిజనల్ అధికారి వెంకట్‌నాయక్‌కు వ్యకాస నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. ఐదేండ్లుగా ప్లాంటేషన్ పోడు వివాదం నడుస్తుందని, ప్లాంటేషన్‌పోడుకు ప్రత్యామ్నాయంగా సగం పోడు భూమి ఇస్తామని ఒప్పందంతో పోడుదారులు ప్లాంటేషన్‌కు ఒప్పుకున్నారని ఎఫ్‌డీవోకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నం వెంకటేశ్వర్లు, అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ లు వివరించారు. ఒప్పందాన్ని అమలు చేయకుండా ప్లాంటేషన్‌పై హక్కు కల్పించకుండా పేదలను స్ధానిక ఫారెస్టు అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు తెలిపారు. గురువారం చర్చలకు పిలిచి పోడుదారులను రెచ్చగొట్టి వివాదాన్ని తెరలేపారన్నారు. చర్చలకు వెళ్ళిన ఘర్షణను ఆపిన నాయకులపైన కేసులు పెట్టటం ఎంతవరకు సబబు అని అన్నారు. ప్లాంటేషన్ పోడు వివాదం జఠిలం కాకుండా చూడాలని పోడుదారుల న్యాయమైన డిమాండ్‌ను అమలు చేసి అక్రమంగా పోడుదారులు, నాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని వినతిలో కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండబోయిన నాగేశ్వరరావు, సహాయకార్యదర్శి యర్రా శ్రీనివాసరావు, నాయకులు కే.నరేంద్ర, భూక్యా శ్రీనివాస్, ఎఫ్‌ఆర్సీ కమిటీ, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు వజ్జా రామారావు తదితరులు పాల్గొన్నారు.








