Mahaa Daily Exclusive

  ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల కోసం విద్యార్థుల నిరసన..!

Share

ఖమ్మం సిటీ, మహా.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరతను తప్పుపడుతూ విద్యార్థులు ఖమ్మం పట్టణంలోని పలు హై స్కూల్స్ వద్ద శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

ఎన్‌ఎస్‌పీ హై స్కూల్, నయాబజార్ హై స్కూల్, ఇంద్రనగర్ హై స్కూల్‌ల వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని, కొన్నిచోట్ల ఐదో తరగతి వరకూ ఒకే ఒక్క ఉపాధ్యాయుడు బోధన నిర్వహిస్తున్నారని నాయకులు యశ్వంత్, అశోక్, శ్రీను, స్టాలిన్‌లు ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యాశాఖలో ఖాళీల భర్తీ డిమాండ్
రాష్ట్రంలో 29 జిల్లాల్లో డీఈఓలు లేరని, 539 మండలాల్లో ఎంఈఓ పోస్టులే కేటాయించలేదని వారు ఆరోపించారు. దాంతోపాటు ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్య తగ్గినందని చెప్పి 2000 పాఠశాలలను మూసేస్తుండటం బాధాకరమని తెలిపారు.

పాఠశాలల్లో మరుగుదొడ్లు, రక్షిత నీరు, కంప్యూటర్లు లేవని, మధ్యాహ్నం భోజనం నాణ్యత కూడా తక్కువేనని చెప్పారు. విద్యాశాఖ మంత్రిని కూడా ఇప్పటివరకు నియమించకపోవడం శోచనీయమని విమర్శించారు.
ఈ నిరసనలో పి.డి.యస్.యూ నాయకులు వెంకటేష్, ప్రాణవ్, అనిల్, రహీమ్, దినేష్, కళ్యాణ్, అరవింద్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Latest