Mahaa Daily Exclusive

  టైగర్ కారిడార్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి మాజీ ఎంపీ సోయం బాపురావు..!

Share

ఆదిలాబాద్, మహా

ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించేందుకు కేంద్రం టైగర్ కారిడార్ ల పేరిట జీవో 49 ను అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని, దీని కారణంగా దాదాపు లక్ష మంది ఆదివాసీలు నిరాశ్రయులు అయ్యే ప్రమాదం ఉన్నందున వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మాజీ ఎంపీ సోయం బాపూరావు డిమాండ్ చేశారు. పట్టణంలోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు విషయాలను వెల్లడించారు. గతంలో గల్లీ నుండి ఢిల్లీ స్థాయికి తుడుం దెబ్బను తీసుకెళ్ళామని, ప్రస్తుత నేతల తీరుతో సంఘం పూర్తిగా విశ్వాసం కోల్పోయిందని ఆక్షేపించారు. కొందరు నేతలు డబ్బులు తీసుకుని తనపై ఆరోపణలు చేశారని ఆరోపించారు. ప్రజలంతా నూతన నాయకత్వం కోరడంతో రాజ్ గోండ్ సేవా సమితిలో చేరడం జరిగిందని తెలిపారు. ఈనెల 27న రాష్ట్ర అధ్యక్షులుగా తాను ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో చేపట్టనున్న కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రాజ్ గోండ్ సేవా సమితి ద్వారా చేపట్టిన ఉద్యమాలు, కాంగ్రెస్ జిల్లా నేతల చొరవతో జీవో 49 రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందన్నారు. బీజేపీ నేతలు సైతం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి జీవో అమలుపై నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చూడాలన్నారు. రాజకీయ స్వలాభం కోసం బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు.