వరంగల్ మహా;
వరంగల్ ప్రాంత దిశదశను మార్చేసే మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులకు అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయగా అందుకు కృషి చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, కు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ధన్యవాదాలు తెలిపారు. రూ.205 కోట్ల నిధులు విడుదల చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. మామునూరు విమానాశ్రయం నిర్మాణానికి భూములిస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.కోటి 20 లక్షలు ఇచ్చేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. అలాగే ప్లాట్లకు, ఇళ్లకు సైతం న్యాయమైన పరిహారం చెల్లించేందుకు ప్రతిపాదించారు. గత నెల రోజులుగా భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో తాము జిల్లా ఇంఛార్జీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తోపాటు జిల్లా కలెక్టర్, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కృషి చేస్తున్నట్టు వివరించారు. కేరళలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం మాదిరిగా మామునూరు ఉండాలని ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. సుమారు 1,000 ఎకరాల్లో నిర్మించనున్నట్టు చెప్పారు. ఎయిర్ పోర్టు పూర్తయితే, మామునూరు విమానాశ్రయం ప్రారంభమైతే చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా సిద్దిపేట జిల్లా కేంద్రం నుంచి అక్కడికి వెళ్లే రహదారుల వెంట అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనేక పరిశ్రమలు వస్తాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి సురేఖ ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో కూడా పర్యాటకం అభివృద్ధి చెందుతుందన్నారు.







