వరంగల్, మహా;
వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్ లోని మండి బజార్, కాశిబుగ్గ, శివనగర్, హంటర్ రోడ్ లోని సాయి నగర్, ఎన్టీఆర్ నగర్ కాలనీలు జల మయమయ్యాయి. హన్మకొండ నగరంలోని కిషన్ పుర, నయీంనగర్, కే యు సి, రెడ్డి కాలనీ, కాకాజీ కాలనీ, హనుమకొండ బస్టాండ్, ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుండడంతో ప్రయాణికుల తో పాటు అత్యవసర అంబులెన్స్లకు కూడా తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా హనుమకొండ బస్టాండు, కాకాజీ కాలనీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేకపోవడంతో వర్షం నీరుతో పాటు పక్కనే ఉన్న సులబ్ కాంప్లెక్స్ నీరు, డ్రైనేజీ కాలువల మురుగు నీరు రోడ్లపైకి రావడంతో ప్రయాణికులు, అంబులెన్స్, రోగులు స్థానికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికులు ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు తెలిపినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేదని స్థానికులు మండిపడుతున్నారు. కాలువల ద్వారా వచ్చే మురుకునీరు మరుగుదొడ్ల వల్ల విష జ్వరాలు వచ్చి రోగాల బారిన పడే అవకాశం ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పక్కనే ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్ కళాశాలలు ఉండడంతో మురుగు నీరు ద్వారా ఈగలు దోమలు వల్ల విద్యార్థులు రోగల బారిన పడకుండా సంభందిత ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేయాలని విద్యార్థులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.







