వరంగల్ మహా ;
వరంగల్ నార్కోటిక్స్ పోలీసులు గంజాయి అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపుతున్న క్రమంలోనే శుక్రవారం భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో చేపట్టిన మెరుపుదాడిలో రూ. 25.54 లక్షల విలువైన 51.081 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ గంజాయి నెట్‌వర్క్‌కు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తి మాత్రం ఇంకా పోలీసులకు చిక్కలేదు.
పక్కా ప్లానింగ్ తో పట్టుకున్న నార్కోటిక్ పోలీసులు..
నార్కోటిక్స్ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, నగరంలోకి పెద్ద మొత్తంలో గంజాయి రవాణా అవుతుందని తెలిసింది. దీంతో జూలై 24న నర్సంపేట రోడ్డు, వరంగల్ వద్ద పోలీసులు వ్యూహాత్మకంగా మాటువేశారు. వారి అంచనా ప్రకారమే, నంబర్ ప్లేట్ లేని ఓ పల్సర్ బైక్ పై ఇద్దరు వ్యక్తులు రెండు పెద్ద సంచుల్లో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వారిని పట్టుకున్నారు.
నిందితుల నుంచి గంజాయితో పాటు, అక్రమ రవాణాకు ఉపయోగించిన నంబర్ లేని పల్సర్ బైక్, అలాగే నేర కార్యకలాపాలకు వాడిన రెండు సెల్ ఫోన్ల ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసు విచారణను పర్యవేక్షిస్తున్న వరంగల్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సైదులు మాట్లాడుతూ ఈ దందాకు ప్రధాన మూలం అయిన ‘పండు’ అనే వ్యక్తి ఇంకా పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపారు. త్వరలోనే అతడిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుందన్నారు. వరంగల్ నగరంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు కంకణ బద్ధులై ఉన్నారని, యువతను ఈ వ్యసనాల బారి నుండి రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రవీందర్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.







