Mahaa Daily Exclusive

  కేసీఆర్‌తో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తా: సీఎం రేవంత్ సవాల్..

Share

తెలంగాణ రాష్ట్రానికి నిధుల కోసం ఢిల్లీలో దీక్ష చేయాలని బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన డిమాండ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంగీకరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను దేశరాజధాని జంతర్‌మంతర్‌ వద్ద దీక్ష చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.

 

అయితే, ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ వస్తే.. ప్రభుత్వాధినేతగా తాను వస్తానని రేవంత్‌ చెప్పారు. రాష్ట్రానికి నిధుల కోసమైనా కేసీఆర్‌ ముందుకు రావాలన్నారు. కేసీఆర్‌తో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తానని సీఎం రేవంత్ తెలిపారు. మీరే తేదీని డిసైడ్ చేయండి దీక్షకు మేం సిద్దమంటూ సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.

 

రాష్ట్రానికి నిధులు తెచ్చుడో, సచ్చుడో తేల్చుకుందామని రేవంత్ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావుకు సవాల్‌ విసిరారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చామని తామెప్పుడూ పదే పదే చెప్పలేదన్నారు. రూ.100 పెట్టి పెట్రోల్‌ కొన్నారు కానీ, అగ్గిపెట్టి కొనలేదని హరీశ్ రావుపై పరోక్ష విమర్శలు చేశారు. అగ్గిపెట్టి మర్చిపోయినట్టు నటించి అమాయక విద్యార్థులను బలిగొనలేదని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

 

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించని అంశంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం ‘ తీర్మానంపై మాట్లాడిన సీఎం రేవంత్రెడ్డి.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

 

రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తిని కేంద్రం కాపాడాలని రేవంత్ కోరారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం దశాబ్దాల పాటు సమాఖ్య స్ఫూర్తిని కాపాడిందని, అన్ని రాష్ట్రాల్లో భారీ సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిందని చెప్పుకొచ్చారు.భాక్రానంగల్‌, నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు.

 

ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్‌ను ప్రధానిగా చేసి దేశాన్ని పరిపుష్ఠం చేసిందని, భారత్‌ ఆర్థికంగా నిలదొక్కుకుందని తెలిపారు. ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్ర ప్రజలు తెలంగాణ సాధించుకున్నారన్న ముఖ్యమంత్రి.. తెలంగాణ అభివృద్ధి కోసం పునర్విభజన చట్టంలో ఎన్నో అంశాలు పెట్టారని గుర్తుచేశారు. అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. నిలదీసి అడగాల్సిన రాష్ట్రప్రభుత్వం గతంలో పదేళ్లు పట్టించుకోలేదని బీఆర్ఎస్‌పై మండిపడ్డారు.

Latest