మంచిర్యాల, మహా : నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నదే ఉల్లాస్ ఉద్దేశమని వయోజన విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ జి ఉషారాణి స్పష్టం చేశారు.
ఆదివారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ భావన సముదాయంలో జిల్లా వయోజన విద్యా కార్యాలయాన్ని సందర్శించి జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్ తో కలిసి ఉల్లాస్ కార్యక్రమం పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ నిరక్షరాస్యతను పూర్తిగా తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని వెల్లడించారు. వయోజనులైన ప్రతి ఒకరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆండాలమ్మ కాలనీలో వయోజన విద్య కార్యక్రమాల ద్వారా వృత్తి శిక్షణ, అక్షరాస్యత పొందిన మహిళలతో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. వయోజన విద్య ద్వారా అక్షరాస్యులై ఓపెన్ టెన్త్, ఇంటర్ ద్వారా ఉన్నత చదువులను చదువుకోవడం ఎంతో మందికి ఆదర్శమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్ ఆఫీసర్ చౌదరి, సత్య నారాయణమూర్తి, డి.ఆర్.పి. సుమన్ తదితరులు పాల్గొన్నారు.







